రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఎంతో ప్రతిష్టాత్మకంగా దర్యాప్తు జరిపిన టాలీవుడ్ డ్రగ్స్ కేసు దర్యాప్తుతో పాటు కోర్టుకు సమర్పించిన ఆధారాలలో కీలకమైనవి సమర్పించలేదని ఈడీ అనేక అనుమానాలను వ్యక్తం చేస్తోంది. ఎక్సైజ్ శాఖ కావాలని కేసు దర్యాప్తును పక్కదారి పట్టించిందన్న అభిప్రాయంతో ఉన్న ఈడీ పూర్తి ఆధారాలను కోర్టుకు సమర్పించలేదని భావిస్తోంది.
ఇదే విషయాన్ని హైకోర్టుకు ఈడీ దాఖలు చేసిన సీఎస్ సోమేష్‌కుమార్, ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్‌లపై వేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్లో స్పష్టం చేసింది. టాలీవుడ్ కేసులో కీలకుడైన కెల్విన్ నుంచి స్వాధీనం చేసుకున్న ఐ ప్యాడ్‌లో తారల చిట్టా ఉందని ఈడీ అనుమానం వ్యక్తం చేస్తోంది.
దర్యాప్తు వివరాలను ఇవ్వాలని హైకోర్టు ఆదేశించినా ఎక్సైజ్ శాఖ ఇవ్వడం లేదన్న ఈడీ సినీతారల కాల్ రికార్డ్స్‌ను కోర్టుకు సమర్పించలేదని ఈడీ తన పిటిషన్లో పేర్కొంది. హైకోర్టు ఆదేశాల మేరకు టాలీవుడ్ డ్రగ్స్ కేసు దర్యాప్తునకు సంబంధించిన పూర్తి వివరాలను ఇవ్వాలంటూ ఇప్పటికి ఆరు సార్లు లేఖలు రాశామని, అయినా స్పందన లేదని తన పిటిషన్లో ఈడీ కోర్టుకు తెలిపింది.
సినీతారలు సహా 41మందిని ఎక్సైజ్ శాఖ విచారించిందని, డిజిటల్ రికార్డులు, వాంగ్మూలాలు, కాల్ రికార్డులను ఇంతవరకు ఇవ్వలేదని ఈడీ పేర్కొంది. 12 కేసుల్లో 23 మంది నిందితులున్నారని, కోర్టులో మాత్రం కేవలం అయిదుగురి వాంగ్మూలాలను మాత్రమే ఉన్నాయని తెలిపింది. ఈడీ పిటిషన్లో పలు కీలకాంశాలున్న నేపథ్యంలో సోమవారం జరుగనున్న పిటిషన్‌పై వాదనలు, కోర్టు నిర్ణయం కీలకంగా మారనుంది.