భారత్ బయోటెక్ సీఎండి డాక్టర్ కృష్ణమూర్తి ఎల్ల, ఆయన సతీమణి సుచిత్ర కృష్ణ ఎల్ల, సంయుక్తంగా పద్మభూషణ్ పురస్కారం అందుకున్నారు. రాష్ట్రపతి రామ్‌నాధ్ కొవింద్ చేతుల మీదుగా విశిష్ట పురస్కారాన్ని స్వీకరించారు.
ఢిల్లీ లోని రాష్ట్రపతి భవన్లో మలివిడత పద్మ అవార్డుల ప్రదానోత్సవం సోమవారం ఘనంగా జరిగింది. మార్చి 21 న తొలివిడతగా కొందరికి అందజేయగా, సోమవారం మిగతా వారికి అందించారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాన మంత్రి నరేంద్రమోడీ, సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు సహా కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, బిజెపి అధ్యక్షుడు నడ్డా హాజరయ్యారు.
హిందుస్థానీ సంగీతంలో ప్రసిద్ధి చెందిన గాయని ప్రభ ఆత్రే పద్మవిభూషణ్ అందుకున్నారు. ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం దివంగత కల్యాణ్ సింగ్‌కు మరణానంతరం కేంద్రం పద్మవిభూషణ్ ప్రకటించగా, ఆయన కుమారుడు రాజ్వీర్ సింగ్ రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డును స్వీకరించారు.
నటుడు విక్టర్ బెనర్జీ పద్మభూషణ్ , ఒలింపిక్స్ గోల్డ్‌మెడలిస్ట్ నీరజ్ చోప్రా , ప్రముఖ సింగర్ సోనూ నిగమ్ పద్మశ్రీ అందుకున్నారు. మొత్తం 74 మంది ప్రముఖులకు పద్మ అవార్డుల ప్రదానం జరిగింది. ఈ ఏడాది మొత్తం 128 మంది ప్రముఖులను పద్మ అవార్డులు వరించగా తొలి దశగా మార్చి 21న 54 మందికి అవార్డుల ప్రదానం జరిగింది.