ఆదాయ పన్ను చట్టం స్థానంలో ప్రత్యక్ష పన్నుల కోడ్‌ను తీసుకురావాలని మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం సూచించారు. అయితే ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక బిల్లులో 39 సవరణలు ఎందుకు చేయాలనుకుంటున్నారో తెలుసుకోవాలనుకుంటున్నానని ఆయన చెప్పారు.
రాజ్యసభలో ఆర్థిక బిల్లుపై జరిగిన చర్చ సమయంలో చిదంబరం మాట్లాడుతూ ప్రస్తుత ఆర్థిక బిల్లులోని 125 క్లాజులు ఉన్నాయని, వాటిలో ఆదాయ పన్ను చట్టం 84 సవరణలు కలిగి ఉందని గుర్తు చేశారు. అయితే ఆర్థిక మంత్రి సవరణ బిల్లులో 125 క్లాజులకు 39 సవరణలు చేశారని, నిశితంగా పరిశీలిస్తే.. ఈ సవరణలు ఆమెకి అర్థంకాలేదని తెలుస్తుందని ఆయన ఎద్దేవా చేశారు.
ఇది వారసత్వ సమస్య అని, ఏడాది అనంతరం ఏడాది కొనసాగుతూనే ఉంటుందని పేర్కొంటూ ఇది ఆగిపోవాలని చిదంబరం స్పష్టం చేశారు. పాత వారసత్వాలన్నింటినీ ఈ ప్రభుత్వం తుడిచివేస్తామని చెబుతోందని, ముందుగా ఆదాయ పన్ను చట్టం పూర్తిగా ప్రత్యక్ష పన్ను కోడ్‌తో మార్చేయాలని ఆయన సూచించారు.
ప్రణబ్ ముఖర్జీ ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో ప్రత్యక్ష పన్నుల కోడ్ ముసాయిదా రూపొందించడంలో సహకరించానని, తాను ఆర్థికమంత్రి ఉన్న సమయంలో మెరుగుపరిచానని ఆయన గుర్తు చేశారు. ప్రత్యక్ష పన్నుల కోడ్‌లో మూడు విధానాలు ఉన్నాయని, వాటిలో చాలా నిబంధనలు కాలం చెల్లినవయ్యానని చెబుతూ వాటన్నింటినీ తీసివేయాలని స్పష్టం చేశారు.
స్వచ్ఛంద సంస్థలు, ఛారిటీలపై విధించే పన్ను గురించి మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా ఉన్న ఛారిటీలన్నీ ఈ నిబంధనలతో, ఏడాదికి ఏడాదికి మారుతున్న సవరణలతో మూలన పడుతున్నాయని చిదంబరం ఆందోళన వ్యక్తం చేశారు. సహేతుకమైన స్వతంత్రతో పనిచేసేలా, తేలికపాటి నియంత్రణ ఉండేలా చూడాలని ఆయన కోరారు.
ప్రస్తుత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫేస్‌లెస్ అసెసెమెంట్ తిరోగమన చర్యగా మాజీ ఆర్ధిక మంత్రి అభివర్ణించారు. ఇవి సంక్ష్లిష్టమైనవి, ప్రజలను మరింత భారాలను మోపుతాయని ఆయన విచారం వ్యక్తం చేశారు.