సుదీర్ఘ కాలంగా అపరిష్కరితంగా ఉన్న సరిహద్దు వివాదానికి అసోం, మేఘాలయ రాష్ట్రాలు చరమ గీతం పాడాయి. 50 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న తమ సరిహద్దు వివాదాల పరిష్కారానికి సంబంధించిన చారిత్రక ఒప్పందంపై రెండు రాష్ట్రాలు అంగీకారానికి వచ్చాయి.
అసోం ముఖ్యమంత్రి హిమంతబిశ్వ శర్మ, మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా మంగళవారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమక్షంలో ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖతో పాటు రెండు రాష్ట్రాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. ఒప్పందంపై ఇరువురు ముఖ్యమంత్రులు సంతకాలు చేయడాన్ని ‘చరిత్రాత్మక రోజు’గా వర్ణించారు. ఈ ఒప్పందం ద్వారా ఇరు రాష్ట్రాల మధ్య 70 శాతం సరిహద్దు వివాదం పరిష్కారమైందని వెల్లడించారు. ఈశాన్య ప్రాంతంలో శాంతి, సంస్కృతి పరిరక్షణ, అభివృద్ధిపై దృష్టి సారించిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీకి చెందుతుందని ఆయన చెప్పారు.
ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న 884.9 కిలోమీటర్ల సరిహద్దులో ఆరు చోట్ల సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న వివాదాన్ని ఈ ఒప్పందం పరిష్కరించనుంది. ఈ ఆరు ప్రాంతాల్లో 36 గ్రామాలు ఉండగా.. 36.79 చదరపు కిలోమీటర్ల వివాదానికి సంబంధించి ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం అసోం 18.51 చదరపు కి.మీ. ప్రాంతాన్ని తమ అధీనంలో ఉంచుకుని మిగిలిన 18.28 చదరపు కి.మీ. ప్రాంతాన్ని మేఘాలయకు ఇస్తుంది.
1972లో అస్సాం నుంచి మేఘాలయను విభజించినప్పటి నుంచి రెండు రాష్ట్రాల మధ్య ఈ వివాదం కొనసాగుతోంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం చొరవతో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ముందుకు రావడంతో సమస్య పరిష్కారమైంది. కాగా, అసోం సీఎంతో పాటు ప్రధాని మోదీ, అమిత్ షాలకు మేఘాలయ ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలిపారు.