ఒబిసి జనగణన చేపట్టాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని వైసిపి ఎంపిలు కోరారు. బుధవారం పార్లమెంటులో ప్రధాన మంత్రిని ఆయన కార్యాలయంలో వైసిపి ఎంపిలు మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, అయోధ్య రామిరెడ్డి కలిశారు. ఈ సందర్భంగా ఒబిసి జనగణన చేపట్టాలని, చట్ట సభలు, న్యాయ వ్యవస్థలో బిసి రిజర్వేషన్లు అమలు చేయాలని వినతిపత్రం అందజేశారు.
అనంతరం ఎపి భవన్లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ.. వెనుకబడిన వర్గాల (ఒబిసి) జనగణన, చట్టసభలు, న్యాయ వ్యవస్థ ఉద్యోగాల్లో బిసి రిజర్వేషన్లు అమలు చేయాలని కోరినట్లు తెలిపారు.
ఇలా ఉండగా, దేశవ్యాప్తంగా కులగణనను కేంద్ర ప్రభుత్వం చేపట్టాలని టిఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం ఉభయ సభల్లో వాయిదా తీర్మానం ఇచ్చింది. పార్టీ ఎంపిలు ఇచ్చిన ఈ తీర్మానంపై రాజ్యసభతో పాటు లోక్‌సభలోనూ తిరస్కరించారు. టిఆర్ఎస్ పార్టీ ఎంపిలు ఉభయ సభల్లోనూ తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాజ్యసభ, లోక్‌సభ నుంచి వాకౌట్ చేశారు.
అనంతరం తెలంగాణ భవన్లో ఎంపిలు రంజిత్‌రెడ్డి, రాములు, శ్రీనివాస్‌రెడ్డి, బిబి పాటిల్ తదితరులతో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజ్యసభలో పార్టీ నాయకుడు కె. కేశవరావు, లోక్‌సభలో పార్టీ నేత లు నామా నాగేశ్వర్‌రావులు మాట్లాడుతూ, కుల గణనపై కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై అసహనం వ్యక్తం చేశారు.
కొన్ని దశాబ్దాలుగా దేశం లో కుల గణన జరగలేదని వారు పేర్కొన్నారు. ఈ అంశం చాలా ముఖ్యమైనదని, వచ్చే జనాభా లెక్కల సందర్భంగా కులగణన కూడా చేయాలని పట్టుబట్టినప్పటికీ ఉభయ సభల్లో కూడా కేంద్రం ముందుకు రాలేదని వారు నిరసన వ్యక్తం చేశారు.