అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరగడానికి ముందే జాతీయ అసెంబ్లీలో మెజారిటీ కోల్పోయిన పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తన పదవికి రాజీనామా చేస్తారా? లేదా జాతీయ అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెడతారా? అన్నది రాజకీయ వర్గాలలో సంచలనం కలిగిస్తున్నది. అయితే చివరి బంతి వరకు ఆడతానని, మధ్యలో పారిపోయే ప్రసక్తి లేదని సంకేతాలు ఇస్తున్నారు.
75 ఏళ్ల పాక్ రాజకీయ చరిత్రలో ఇప్పటి వరకు ఏ ప్రధాని కూడా పూర్తి పదవీకాలం (ఐదేళ్లు) పూర్తి చేసుకోలేదు. మిలిటరీ జోక్యంతో దాదాపుగా గద్దె దిగిపోవడం లేదంటే శరణార్థులుగా బయటి దేశాలకు పారిపోవడం జరిగింది. అలాగే ఏ ఒక్కరూ అవిశ్వాసంలో ఓడిపోలేదు కూడా. ఇమ్రాన్ ఖాన్ ఇప్పటికే నాలుగేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్నాడు.
ఈ తరుణంలో.. అసెంబ్లీని రద్దు చేసి ముందస్తుకు వెళ్లాలనే ఆలోచనలోనూ ఇమ్రాన్ ఉన్నట్లు చెబుతున్నారు. మరోవైపు ఇమ్రాన్ ఖాన్ నుంచి రాజీనామాను ఆశించని ప్రతిపక్ష కూటమి నేత, పీఎంఎల్-ఎన్ చీఫ్ షహబాజ్ షరీఫ్.. తదుపరి ప్రధాని అయ్యే అవకాశం ఉందన్న ఊహాగానాలు పాక్ రాజకీయ వర్గాల్లో జోరుగా చక్కర్లు కొడుతున్నాయి.
గురువారం విశ్వాస పరీక్షను ఎదుర్కొనే వేళ ప్రధాన మిత్రపక్షం ముత్తహిదా క్వామి మూవ్మెంట్ (ఎంక్యుఎం) ప్రభుత్వానికి మద్దతును ఉపసంహరించుకుంటున్నామని, ప్రతిపక్షాలు పెట్టే అవిశ్వాస తీర్మానానికి మద్దతిస్తామని ప్రకటించింది. దీంతో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం మైనారిటీలో పడిపోయింది. ఈ పరిస్థితుల్లో ప్రధాని తక్షణమే రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
నేషనల్ అసెంబ్లీలో ఇమ్రాన్‌ఖాన్ పార్టీకి సాధారణ మెజారిటీ లేకపోవడంతో మిత్రపక్షాల మద్దతుపై ఆధారపడింది. ఇప్పటివరకు అతిపెద్ద మిత్రపక్షంగా ఎంక్యుఎం వుంది. ఈ పార్టీ నుండి మంత్రులుగా వున్నవారిలో ఇద్దరు రాజీనామా చేసినట్లు కూడా వార్తలందుతున్నాయి. కాగా, తాజా పరిణామాల నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ బుధవారం మంత్రివర్గ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ప్రత్యేక ఆహ్వానంపై మిత్రపక్షాల అధినేతలు కూడా ఈ ప్రత్యేక సమావేశానికి హాజరయ్యారని ప్రభుత్వ రేడియో తెలిపింది. కాగా, షెడ్యూల్ ప్రకారం గురువారం పార్లమెంట్ సమావేశమవుతుందని, సమస్య పరిష్కారమవుతుందని పిపిపి చీఫ్ బిల్వాల్, పిఎంఎల్-ఎన్ చీఫ్ నవాజ్ షరీఫ్‌లు చెప్పారు.
అంతర్జాతీయ కుట్ర
తనను అధికారం నుండి తొలగించడం వెనుక అంతర్జాతీయ కుట్ర జరుగుతోందని ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. ఇందుకు సంబంధించి తన వద్ద రాతపూర్వక సాక్ష్యాలు కూడా వున్నాయని, ఆ బెదిరింపు లేఖను చూపిస్తానంటూ కొంతమంది సీనియర్ జర్నలిస్టులతో ఆ వివరాలు పంచుకున్నారు.
ఆ జర్నలిస్టుల్లో ఒకరైన అర్షద్ షరీఫ్ ఎఆర్‌వై న్యూస్‌తో మాట్లాడుతూ, అవిశ్వాస తీర్మానం గెలుపొందితే అంతర్జాతీయంగా పాక్ సమస్యలు తగ్గుతాయని, ఒకవేళ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఈ తీర్మానంలో గెలుపొందితే పాక్‌కు చిక్కులు మొదలవుతాయని ఆ లేఖ పేర్కొంటోంది.
తొలుత దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించాలని ఇమ్రాన్ భావించారు కానీ తర్వాత దాన్ని వాయిదా వేసుకున్నారు. రాజీనామా చేయాలన్న డిమాండ్లు తలెత్తిన నేపథ్యంలో ఈ ప్రసంగాన్ని వాయిదా వేశారు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్, ఐఎస్ఐ హెడ్లు ఇమ్రాన్‌తో భేటీ అయిన అనంతరం ప్రసంగం వాయిదా పడింది.