కోర్టు ధిక్కార కేసులో ఎనిమిది మంది ఐఏఎస్ అధికారుపై ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తొలుత వీరికి జైలుశిక్ష, జరిమానా విధించిన ధర్మాసనం క్షమాపణలతో తగ్గించింది. జైలు శిక్షకు బదులుగా సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు సేవ చేయాలని ఆదేశించింది.
ఈమేరకు జస్టిస్ బి.దేవానంద్ గురువారం తీర్పు చెప్పారు. గ్రామ, వార్డు సచివాలయాలను ప్రభుత్వ పాఠశాలల నుండి తొలగించాలని గతంలో హైకోర్టు తీర్ప చెప్పిన విషయం తెలిసిందే. ఏడాదైనా ఆ తీర్పు పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోలేదు. ఈ నేపథ్యంలో దీనికి భాధ్యులైన ఐఎఎస్ అధికారులను స్వయంగా హాజరుకావాలని గత విచారణ సందర్భంగా హైకోర్టు ఆదేశించింది. దీంతో వారు గురువారం ధర్మాసనం ముందు హాజరయ్యారు.
పంచాయతీరాజ్ కార్యదర్శి గోపాలకఅష్ణద్వివేదీ, కమిషనర్ గిరిజాశంకర్, పాఠశాల విద్యాశాఖ గత ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్, గత కమిషనర్ చిన వీరభద్రుడు, మున్సిపల్ శాఖ అప్పటి ముఖ్య కార్యదర్శి జె.శ్యామలరావు, మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రదాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మీ, ఆ శాఖ అప్పటి డైరెక్టర్ జి.విజరుకుమార్, ప్రస్తుత డైరెక్టర్ ఎంఎం.నాయక్‌లకు హైకోర్టు శిక్ష విధించింది.
కోర్టు ఉత్తర్వులను కావాలనే అమలు చేయలేదని హైకోర్టు తేల్చింది. ఏడాదిగా నిర్లక్ష్యంగా వ్యవహరించారని వ్యాఖ్యనించింది. ఉత్తర్వులు ఇచ్చిన తరువాత కూడా పాఠశాలల్లో సచివాలయాల నిర్మాణాలు జరిగాయి ఇందుకు బాధ్యులైన 8 మంది అధికారులకు రెండు వారాల జైలు శిక్ష, ఒక్కొక్కరికి రూ. వెయ్యి చొప్పున జరిమానా విధిస్తున్నాం.. అనిహైకోర్టు ప్రకటించింది.
ఈ నేపథ్యంలో అధికారులు బేషరతుగా క్షమాపణలు చెప్పారు. దీంతో నెలలో వారికి నచ్చిన ఒక ఆదివారం జిల్లాల్లోని ఏదైనా సంక్షేమ హాస్టల్లో సేవ చేయాలని, 12 ఆదివారాలు వేర్వేరు హాస్టల్స్‌లోని విద్యార్థులకు సేవ చేయాలనిశిక్ష విధించింది.
ఒక పూట భోజన ఖర్చులు కూడా వారే సొంతంగా ఖర్చులు భరించాలంది. ఒకో అధికారికి ఒకో జిల్లా కేటాయింపు చేయాలనిచెప్పింది. ఈ మేరకు కృష్ణాజిల్లాను గోపాలకృష్ణద్వివేదీకి, ప్రకాశం జిల్లాను గిరిజా శంకర్, శ్రీకాకుళంను రాజశేఖర్‌కు, విజయనగర జిల్లాను చిన వీరభద్రుడుకు, అనంతపురం జిల్లాను శ్యామలరావుకు, పశ్చిమగోదావరి జిల్లాను వై శ్రీలక్ష్మీకి, కర్నూలును విజయకుమార్‌కు, నెల్లూరు జిల్లాను ఎంఎం నాయక్‌కు కేటాయించారు.
కేటాయించిన జిల్లాల్లోని సాంఘిక సంక్షేమ హాస్టళ్లను అధికారులు ప్రతి నెలా సందర్శించాలని, సేవ చేయడంతో పాటు, ఒకరోజు పగలు లేదారాత్రి పూట భోజన ఖర్చులు భరించాలని కోర్టు ఆదేశించింది. ఈ మేరకు చేసినట్లుగా ఒక మెమోను రిజిష్ట్రార్ జుడీషియల్కు అందజేయాలని తెలిపింది. ఈ ఉత్తర్వులను అమలు చేయకపోవతే కోర్టు ధిక్కార కేసును తిరిగి ప్రారంభిస్తామని హెచ్చరించింది.