ఉక్రెయిన్ పై యుద్దాన్ని ఆసారాగా తీసుకొని రష్యాపై కఠినమైన ఆర్ధిక ఆంక్షలు విధించడం ద్వారా అమెరికా, ఐరోపా దేశాలు రష్యాను ఆర్ధికంగా పతనం వైపుకు నెట్టడంతో ఏమేరకు ఫలితం సాధించాయి గాని, ఇప్పటి వరకు అంతర్జాతీయ వాణిజ్య వ్యవహారాలలో ఆధిపత్యం వహిస్తున్న డాలర్, యురొ కరెన్సీల ప్రభావం మాత్రం గణనీయంగా కోల్పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఆంక్షల పుణ్యమాని రూబుల్ , ఇతర దేశాల జాతీయ కరెన్సీలు వెలుగులోకి రాగా, డాలర్, యూరోలు మసకబారుతున్నాయి. ఒక దేశం తరువాత ఒక దేశం తమ కరెన్సీలను డాలర్ నుంచి తమ సొంత జాతీయ కరెన్సీలో విదేశీ వాణిజ్యాన్ని నెరిపేందుకు ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి.
దీంతో అంతర్జాతీయ వాణిజ్యంలో ఇంతవరకు చక్రం తిప్పిన డాలర్, యూరోల ప్రాభవం దిగజారడం మొదలైంది. చాలా దేశాలు ఇప్పుడు తమ జాతీయ కరెన్సీలోనే చెల్లింపులు జరిపేందుకు ప్రాధాన్యమిస్తుండడంతో డాలర్ అవసరం తగ్గిపోతున్నది.
‘ డారల్ నుంచి ఇతర కరెన్సీల్లోకి మళ్లే క్రమం మొదలైంది. ఇక్కడితో ఆగేది కాదు.’ అని రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రెస్ సెక్రటరీ డిమిట్రి పెస్కొవ్ చెప్పారు. అమెరికా ఆధిపత్యానికి వీలుగా ప్రపంచంపై డాలర్ పెత్తనాన్ని రుద్దిన బ్రెటన్ వుడ్స్ విధానం పూర్తిగా తుడిచిపెట్టుకుపోవడానికి ఎంతో కాలం పట్టకపోవచ్చు అని అని ఆయన చెప్పారు.
ఉక్రెయిన్ సంక్షోభానికి సంబంధించి అమెరికా రష్యాపై ఆర్థిక ఆంక్షలు విధించడంతోబాటు విదేశాల్లోని రష్యా అస్తులను స్తంభింపజేస్తూ స్విఫ్ట్ ఇంటర్ బ్యాంకింగ్ మెసేజ్ సిస్టమ్‌ను నిలిపివేయండం వంటి చర్యలకు పాల్పడింది.
అమెరికా ఆంక్షలను రష్యా ఏమాత్రం లెక్కచేయలేదు. తన చమురు, గ్యాస్‌ను ఇతర దేశాలకు అమ్మేటప్పుడు, రూబుల్స్ లేదా అవతలి దేశం సొంత కరెన్సీ చెల్లిస్తే చాలు అని చెబుతోంది. పైగా, తమ ఇంధనం అవసరాలలో రష్యాపై ఎక్కువగా ఆధారపడిన జర్మనీ వంటి దేశాలను సహితం రూబుల్ లో చెల్లించాలని రష్యా కోరుతున్నది.