ఉద్ధవ్ థాకరే సారథ్యంలోని మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కేంద్ర ఏజెన్సీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తునకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) ఏర్పాటు చేసింది. కొందరు
ఈడీ అధికారులు బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారంటూ శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఇప్పటికే ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలకు సంబంధించి ‘సిట్’ను ఉద్ధవ్ సర్కార్ ఏర్పాటు చేసింది.
మహారాష్ట్ర హోం శాఖ మంత్రి దిలీప్ వాల్షే పాటిల్ మీడియాతో మాట్లాడుతూ, వీరేష్ ప్రభు అనే అధికారి నేతృత్వంలో సిట్ పని చేస్తుందని చెప్పారు. నిర్దేశిత గడువులోగా దర్యాప్తు పూర్తి చేయాల్సి ఉంటుందని చెప్పారు.
సంజయ్ రౌత్ గత నెలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కొందరు ఈడీ అధికారులు కొందరిపై విమర్శలు చేశారు. కొందరు అధికారులు బీజేపీకి ‘ఏటీఎం’లుగా పని చేస్తున్నారని ఆరోపించారు. నలుగురు ఈడీ అధికారులపై బలవంతపు వసూళ్ల ఆరోపణలపై ముంబై పోలీసులు దర్యాప్తు జరుపనున్నారని, వీరిలో కొందరు జైలుకు కూడా వెళ్లాల్సి వస్తుందని చెప్పారు. అయితే, ఆ అధికారుల పేర్లను మాత్రం సంజయ్ రౌత్ వెల్లడించలేదు.
కాగా, మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద మంగళవారంనాడు సంజయ్‌రౌత్, ఆయన కుటుంబ సభ్యులకు చెందిన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జప్తు చేసిన కొద్దీ గంటలకే రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఈ సందర్భంగా ప్రొవిజినల్ అటాచ్‌మెంట్‌ను ఈడీ జారీ చేసింది.
ఈ క్రమంలోనే అవినీతి ఆరోపణలపై పలువురు ఈడీ అధికారులపై దర్యాప్తునకు సిట్ ఏర్పాటు చేస్తున్నట్టు మహారాష్ట్ర సర్కార్ ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ మధ్యనే ముఖ్యమంత్రి బావమరిది ఆస్తులను సహితం జప్తు చేసింది. ఈ సందర్భంగా వారి లక్ష్యం తానే అయితే, తననే అరెస్ట్ చేయమని, తమ కుటుంభం సభ్యులను ఇబ్బందులకు గురిచేయవద్దని అంటి రాష్ట్ర శాసనసభలో ఉద్ధవ్ థాకరే భావోద్వేగంతో కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
కాగా, ఈడీ జప్తు చేసిన సంజయ్ రౌత్ ఆస్తుల్లో అలీబాగ్‌లో రూ.9 కోట్లు విలువచేసే ఎనిమిది ల్యాండ్ పార్సెల్స్ (ప్లాట్లు), ముంబైలోన దాదర్ శివార్లలో ఉన్న రూ.2 కోట్లు విలువచేసే ఒక ఫ్లాట్ ఉన్నాయి. పీఎంఎల్ఏ కింద ఈ ప్లాట్లు, ఫ్లాట్ జప్తు చేస్తూ ప్రొవిజనల్ ఆటాచ్‌మెంట్‌ను ఈడీ జారీ చేసినట్టు అధికారులు తెలిపారు. ముంబైలోని ఓ భారీ రెసిడిన్షియల్ బిల్డింగ్ రీ-డవలప్‌మెంట్‌కు సంబంధించి రూ.1,034 కోట్ల విలువైన ల్యాండ్ స్కామ్‌లో మనీ ల్యాండరింగ్ దర్యాప్తులో భాగంగా ఈ జప్తు జరిగినట్టు చెబుతున్నారు.
తన ఆస్తులు జప్తు చేయడంపై సంజయ్ రౌత్ ఘాటుగా స్పందిస్తూ ”నా ఆస్తులు జప్తు చేయండి, కాల్పులు జరపండి, జైలుకు పంపండి, ఏమాత్రం భయపడేది లేదు. సంజయ్ రౌత్ అనే వ్యక్తి బాలాసాహెబ్ థాకరే అనుచరుడు, శివసైనికుడు. అతను పోరాడతాడు, ప్రతి ఒక్కరి వ్యవహారం బయటపెడతాడు. చూస్తూ కూర్చునే రకం కాదు. వాళ్లను డాన్స్ చేయనీయండి. నిజం వెలుగుచూస్తుంది” అని హెచ్చరించారు.