2024లో వైసిపి అధికారంలోకి వచ్చే ప్రసక్తి లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. . ‘గెలవని పార్టీ కోసం మీరు తపన పడొద్దు’ అంటూ గీత దాటి వ్యవహరిస్తున్న కొందరు అధికారులను , ముఖ్యంగా పోలీస్ అధికారులను ఉద్దేశించి ఆయన హెచ్చరించారు.
మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం జనసేన పార్టీ విస్తృతస్ధాయి సమావేశం నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన జరిగింది. దీనికి ముఖ్యఅతిథిగా హాజరైన పవన్ మాట్లాడుతూ వైసిపి వ్యతిరేక ఓటు చీలనివ్వనని నేనంటే పార్టీలో కొందరు బిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారని విచారం వ్యక్తం చేశారు.
వ్యూహాలు తనకు వదిలేయాలని కోరుతూ ఎవరి పల్లకి మోసే దానికి తాములేమని, ప్రజలను పల్లకి వెక్కించేందుకు ఉన్నామని స్పష్టం చేశారు.ఏ పార్టీతో పొత్తులో ఉన్నా మాట చెప్పేందుకు భయపడాల్సిన అవసరం లేదని, 70 శాతం అభిప్రాయాలు కలిస్తే చాలని 30 శాతం అభిప్రాయాలను ఏకీభవించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
ఆర్థిక కష్టాలతో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులను ఆదుకునేందుకు ‘జనసేన రైతు భరోసా యాత్ర’ చేపడుతున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో మృతి చెందిన కౌలు రైతుల కుటుంబాలను ఆదుకునేందుకు ఈనెల 12న అనంతపురం నుంచి జనసేన రైతుభరోసా యాత్ర చేపట్టనున్నట్లు తెలిపారు.
రైతు కుటుంబాలను ఆదుకునేందుకు తమ వంతుగా రూ.5 కోట్లు విరాళంగా పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఒక్కో రైతు కుటుంబానికి లక్ష వంతున ఆర్ధిక సహకారం అందించనున్నట్లు వెల్లడించారు. కర్నూలులో 353 మంది, అనంతపురంలో 170 మంది, తూర్పు, పశ్చిమ గోదావరిలో 81 మంది కౌలు రైతులు మరణించారని పేర్కొన్నారు.
కాగా, కేంద్రం పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గించాల్సి ఉందని తెలిపారు. ఈ మాట చెప్పడానికి భయపడాల్సి అవసరం లేదని పార్టీ నేతలకు స్పష్టం చేశారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు జనసేనకు బలమైన జిల్లాలని చెబుతూ ఉత్తరాంధ్రపై తాను ప్రత్యేక దృష్టి సారిస్తానని పేర్కొన్నారు.
ఉత్తరాంధ్రలో మనకున్న బలాన్ని సరిగా ఉపయోగించుకోవడం లేదని చెబుతూ స్థానికంగా. నాయకత్వాన్ని పెంచాల్సిన అవసరం ఉందని సూచించారు. దీనికోసం రీజినల్ ఆఫీసు ఉండాలని తాను కోరుకుంటున్నట్లు వెల్లడించారు.
వైసిపి అరాచకాలు, దౌర్జన్యాలతో రాష్ట్రం 20 సంవత్సరాలు వెనక్కి వెళ్లిందని ధ్వజమెత్తుతూ 2024లో ఓటు అడిగే హక్కు వైసిపికి లేదని తేల్చి చెప్పారు. అప్పులు ఎక్కువ చేసి వెళ్లిపోతే రాబోయో ప్రభుత్వం ఏమీ చేయలేని పరిస్థితిలోకి నెట్టాలనే వ్యూహంతో వైసిపి ముందుకు వెళుతోందని ఎద్దేవా చేశారు.
జనసేన అధికారంలోకి రాగానే ఖాళీ ఉద్యోగాలను భర్తీ చేస్తామని, రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చి అభివృద్ది బాటలోకి తీసుకెళ్తామని ప్రకటించారు. విశాఖ, తిరుపతి, కర్నూలు ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని తెలిపారు. అమరావతి రాజధాని అనే విషయాన్ని గట్టిగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు.
విశాఖస్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేస్తూ ఒక వేళ ప్రైవేటీకరణ చేస్తే మనం ఎలా వ్యవహరించాలనే అంశంపై అందరమూ కూర్చొని ఒక నిర్ణయం తీసుకుందామని తెలిపారు. విదేశాల్లో చదువుకునే ఎస్సి, ఎస్టి విద్యార్థులకు స్కాలర్షిప్పు కింద ప్రభుత్వం ఆర్ధిక సహకారం అందించేదని, వైసిపి ప్రభుత్వం దానిని రద్దు చేసిందని విమర్శించారు.