ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ బుధవారంనాడు కలుసుకోవడం రాజకీయ కలకలం రేపుతున్నది. పార్లమెంట్లో ఉభయులూ సుమారు 20 నుంచి 25 నిమిషాల పాటు సమావేశమయ్యారు. దీంతో వీరి సమావేశం వెనుక కారణం ఏమై ఉండవచ్చనేది ప్రధానంగా మహారాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది.
శివసేన కీలక నేత సంజయ్ రౌత్ ఆస్తులను ఈడీ జప్తు చేయగానే, ఈడీ అధికారులపై తలెత్తిన అవినీతి ఆరోపణలపై మహారాష్ట్ర ప్రభుత్వం సిట్ ను నియమిస్తున్నట్లు ప్రకటించిన మరుసటి రోజుననే ఈ సమావేశం జరగడం గమనార్హం. పైగా, మహారాష్ట్ర మజీ హోంమంత్రి, ఎన్సీపీ నేత అనిల్ దేశ్‌ముఖ్‌ను బుధవారం ఉదయం సీబీఐ కస్టడీలోకి తీసుకుంది.
మహారాష్ట్రలోని అధికార మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) నేతలపై, ముఖ్యంగా ఎన్సీపీ, శివసేన నేతలపై ఎన్ఫోర్స్మెంట్ డెరెక్టరేట్ (ఈడీ) వరుస దాడులకు పాల్పడుతుండంతో మోదీని పవార్ కలుసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
కాగా, సంజయ్ రౌత్‌పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తీసుకున్న చర్య ‘అన్యాయం’ అని శరద్ పవార్ స్పష్టం చేస్తూ సంజయ్ రౌత్, ఆయన కుటుంబానికి చెందిన ఆస్తుల జప్తు అంశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకువచ్చినట్టు ఆయన చెప్పారు. తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇలాంటి చర్యకు ఒక కేంద్ర సంస్థ తీసుకుంటే, దానికి వాళ్లే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినందుకే రౌత్‌పై ఈడీ చర్య తీసుకుందని పవార్ ఆరోపించారు. రౌత్‌పై ఈడీ చర్యను ప్రధాని దృష్టికి తీసుకువెళ్లినప్పుడు ఆయన ఏమీ మాట్లాడలేదని పవార్ తెలిపారు. కేవలం తమ ప్రభుత్వమును పడగొట్టడం కోసమే ఈ దాడులు జరుపుతున్నరని, కుటుంభం సభ్యులపై కూడా జరుపుతున్నారని అంటూ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే నుండి పలువురు శివసేన నేతలు ఆరోపణలు చేస్తుండగా, తమ పార్టీ మంత్రులు ఇద్దరినీ అరెస్ట్ చేసినా ఎన్సీపీ నేతలు దాదాపు మౌనం వహిస్తున్నారు.
ఈ దాడులపై కేంద్ర ప్రభుత్వంపై పల్లెత్తు మాట అనడం లేదు. మరోవంక తన మంత్రివర్గం విస్తరణకు థాకరే పూనుకున్న సమయంలో ఈ భేటీ జరగడం గమనార్హం. వవార్, మోదీ సమావేశంపై ఎన్సీపీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయనప్పటికీ, ఇది సహజమైన ప్రక్రియేనని, మరీ పెద్దదిగా చేసి చూడనవసరం లేదని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పవార్ మేనల్లుడు అజిత్ పవార్ తెలిపారు.
సమావేశం గురించి తనకు సమాచారం ఏమీ లేదని, సమాచారం తెలిస్తే చెబుతానని పేర్కొన్నారు. పైగా, అభివృద్ధి అంశాలపై చర్చించేందుకు దేశ ప్రధాని, జాతీయ పార్టీ నేత సమావేశం కావడం సహజమేనని సమర్ధించారు. ఆ అంశాలు ప్రస్తావనకు వచ్చి ఉండొచ్చని, ఇద్దరూ పెద్ద నేతలేనని అజిత్ పవార్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
మనీ లాండరింగ్ కేసులో భాగంగా సంజయ్ రౌత్ భార్య, ఆయన ఇద్దరు అసోసియేట్లకు చెందిన రూ.11.15 కోట్ల విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మంగళవారంనాడు సీజ్ చేసింది. ఈడీ చర్యపై సంజయ్ రౌత్ ఘాటుగా స్పందించారు. తాను బాలాసాహెబ్ ఫాలోయర్నని, శివసైనికుడినని, తనను కాల్చినా, జైలుకు పంపినా భయపడేది లేదని, నిజానికే ఎప్పటికీ గెలుపని స్పష్టం చేసారు. ఈడీలోని కొందరు అవినీతి అధికారులపై అవినీతి ఆరోపణలు ఉన్నాయని, వాటిపై ముంబై పోలీసులు దర్యాప్తు చేస్తా రు.
కాగా, ఎన్సీపీ నేతలపై ఈడీ చర్యలు వాస్తవమే అయినప్పటికీ, బీజేపీ, ఎన్సీపీ మధ్య పొరపొచ్చాలు లేవని బీజేపీ నేత సుధీర్ ముంగటివార్ స్పష్టం చేయడం గమనార్హం. పలువురు ఎంవీఏ నేతలపై ఈడీ విచారణ జరుపుతోందని, ఇద్దరు ఎన్సీపీ నేతలు జైలులో ఉన్నారని, పలువురు శివసేన నేతలపై కూడా విచారణ జరుగుతోందని, బహుశా ఆ కారణంగానే ప్రధానితో పవార్ సమావేశమై ఉండవచ్చని మరో బీజేపీ నేత ప్రవీణ్ దారేకర్ అభిప్రాయపడ్డారు. అవినీతి అంశాలపై రాజీ పడేది లేదని ప్రధాని మోదీ ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత కూడా చెప్పిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.