సుప్రీం కోర్టులో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అవిశ్వాస తీర్మానం విషయంలో డిప్యూటీ స్పీకర్ ఖాసీం సూరీ తీసుకున్న నిర్ణయం తప్పుడు నిర్ణయమని, రాజ్యాంగ వ్యతిరేకం అని సుప్రీం స్పష్టం చేసింది. అవిశ్వాసంపై మళ్లీ ఓటింగ్ నిర్వహించాలని, జాతీయ అసెంబ్లీని పునరుద్ధరించాలని స్పష్టం చేశారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు పాక్ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానంపై శనివారం ఓటింగ్ జరగనుంది.
ఇమ్రాన్‌పై విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని తోసిపుచ్చడం సరికాదని కోర్టు పేర్కొంది. ఇమ్రాన్ సర్కార్‌పై విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్ తిరస్కరించడం, జాతీయ అసెంబ్లీ రద్దు వంటి అంశాలపై సుప్రీంకోర్టు గురువారం విచారణ జరిపింది.
పాకిస్తాన్ చీఫ్ జస్టిస్ ఉమర్ అట బండియల్ నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల విస్తృత ధర్మాసనం ముందు అటార్నీ జనరల్ ఖలీద్ జావెద్ ఖాన్ వాదనలు వినిపించారు. పార్లమెంటు అంతర్గత వ్యవహారాల్లో న్యాయస్థాన జోక్యం సరికాదని, స్పీకర్ నిర్ణయాలను సవాల్ చేసే అధికారం కోర్టులకు లేవని పాక్ ప్రధాని తరపు న్యాయవాది వాదించారు.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉమర్ అతా బండియాల్ నేతృత్వంలోని ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టింది. అంతా రాజ్యాంగం ప్రకారమే నడుస్తుంటే మరి దేశంలో రాజ్యాంగ సంక్షోభం ఎక్కడుంది? అంటూ రాష్ట్రపతి తరఫు న్యాయవాదిని సీజే బండియాల్ ప్రశ్నించారు.
అసలు పాక్‌లో రాజ్యాంగ సంక్షోభం ఉందా? లేదా? అన్న విషయంలో ఎందుకు స్పష్టత ఇవ్వడం లేదని సీజే ఆయనను సూటిగా ప్రశ్నించారు. అన్ని నియమాలనూ తుంగలో తొక్కి ప్రధానిని కాపాడితే.. సరైన దేనా? అని కూడా ప్రశ్నించారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 58 క్లాజ్ (1) ప్రకారం జాతీయ అసెంబ్లీని రద్దు చేయాలంటూ ప్రధాని.. అధ్యక్షుడికి సిఫారసు చేయకూడదని పేర్కొంది. అవిశ్వాస తీర్మానంలో ఒకవేళ ఇమ్రాన్ ఓడిపోతే, కొత్త ప్రధాని కోసం ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది.
రాజ్యాంగాన్ని రక్షించే విషయంలో ఏఏ నిబంధనలు ఉన్నాయో, వాటి ప్రకారమే జరిగిందని రాష్ట్రపతి తరఫు న్యాయవాది బదులిచ్చారు. అవిశ్వాస తీర్మానాన్ని డిప్యూటీ స్పీకర్ తిరస్కరించడాన్ని సుప్రీం తప్పుబాడుతూ, పాకిస్థాన్ ఆర్ధిక పరిస్థితి సరిగా లేదని, శ్రీలంకలా తయారవుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. పాక్‌లో సుస్థిర ప్రభుత్వం ఏర్పడాలని, బలహీన ప్రభుత్వం సరికాదని పాక్ సుప్రీం కోర్టు అభిప్రాయ పడింది.
మరోవైపు ఇమ్రాన్ కేబినెట్లో మంత్రిగా పనిచేసిన ఫవాద్ చౌదరి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ఇమ్రాన్‌కు వ్యతిరేకంగా వస్తే దేశం 5 దశాబ్దాలు వెనక్కు వెళ్తుందన్నారు. విపక్షాలు విదేశాలతో చేతులు కలిపి కుట్ర చేశాయని ఆరోపించారు.