భారత్ పై విషం కక్కడం, కాశ్మీర్ వివాదాన్ని లేవనెత్తడం ద్వారానే పాకిస్థాన్ లో రాజకీయ నాయకులు `నిజమైన అధికారం’ చెలాయిస్తున్న సైన్యాన్ని మెప్పించే ప్రయత్నం చేస్తుంటారు. ఇప్పుడు ప్రధాని పదవి కోసం ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన షాబాజ్ షరీఫ్ సహితం అదే పల్లవి అందుకున్నారు.
కశ్మీర్ సమస్య పరిష్కారమయ్యే వరకు భారత్‌లో సంబంధాలు సాధారణ స్థితికి రావని స్పష్టం చేసారు.
శనివారం అర్ధరాత్రి పాక్ జాతీయ అసెంబ్లీలో ఇమ్రాన్ ఖాన్ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో ఇమ్రాన్ ఖాన్ పదవీచ్యూతుడయ్యాడు. అవిశ్వాసం నెగ్గడంతో ప్రతిపక్ష పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సన్నద్ధమవుతోంది.
ఈ క్రమంలోనే షాబాజ్ షరీఫ్‌ను ప్రధాని అభ్యర్థిగా ఎంపిక చేసింది.
ఈ మేరకు ఆయన నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయనను కొత్త ప్రభుత్వం భారత్‌తో సంబంధాలను మెరుగుపర్చేందుకు కృషి చేస్తుందా? అని మీడియా ప్రశ్నించింది. కశ్మీర్ సమస్య పరిష్కారం కానంత వరకు భారత్‌తో సంబంధాలు మామూలుగా ఉండవని చెప్పారు.
అవినీతి ఆరోపణలతో జైలు జీవితం గడిపి, ప్రస్తుతం బ్రిటన్ లో ప్రవాస జీవనం గడుపుతున్న మూడు సార్లు ప్రధానిగా పనిచేసిన ప్రధాని నవాజ్ షరీఫ్ సోదరుడే ఈయన. తన అన్నపై కొనసాగుతున్. కేసులపై విచారణ చట్టపరంగా కొనసాగుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం జాతీయ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరిస్తున్నారు.
కొత్త ప్రభుత్వంలో రాజకీయ ప్రత్యర్థులపై ఎలాంటి ప్రతీకార చర్యలు ఉండవని, అయితే చట్టం తన పని తాను చేసుకుంటుందని ఆయన పేర్కొన్నారు. ‘ మేము ఎవరిపైనా ప్రతీకారం తీర్చుకోము, ఎవరికీ అన్యాయం చేయం, మేము ఎవరినీ జైలులో పెట్టం, చట్టం దాని పని అది చేస్తుంది’ అని ట్వీట్ చేశారు. నూతన ప్రధానిని ఎన్నుకునేందుకు పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు తిరిగి సమావేశం కానుంది.
కాగా, అవిశ్వాస తీర్మానంలో ఓటమిపాలైన ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్థాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ పార్టీ తమ ప్రధాని అభ్యర్థి పేరును ప్రకటించింది. ప్రధానమంత్రి అభ్యర్థిగా మాజీ విదేశాంగ మంత్రి షా మెహమూద్ షురేషీని ప్రకటించింది. ఉమ్మడి ప్రతిపక్షం షాబాజ్ షరీఫ్‌ను ప్రధాని పదవికి ఎంపిక చేయగా.. ఆయన ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు.