ప్రత్యక్ష చర్చల ద్వారానే ఉక్రెయిన్ యుద్దానికి ముగింపు పలకగలమని భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షులు జో బైడెన్ తో సోమవారం వర్చువల్గా జరిగిన భేటీలో రష్యా-ఉక్రెయిన్ మధ్య సంక్షోభం ముగించడానికి, ప్రపంచ ఆహార సరఫరా, వస్తువుల మార్కెట్లపై అస్థిరత ప్రభావాన్ని అంతం చేయడానికి ఇరు దేశాల అధ్యక్షుల మధ్య ప్రత్యేక చర్చలే మార్గమని ప్రధాని తెలిపారు.
రష్యా అధ్యక్షులు పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షులు జెలెన్స్కీతో జరిపిన ఫోన్ సంభాషణల్లోనూ ఇదే విషయాన్ని తెలిపినట్లు చెప్పారు. ఉక్రెయిన్లో పరిస్థితి ప్రధానంగా, బుచా నగరంలో అనేకమంది మహిళలు, చిన్నారులు, పౌరులు హత్య చేయబడ్డారని వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయని ప్రధాని పేర్కొన్నారు. . మరణాలను భారత్ తక్షణమే ఖండించిందని, స్వతంత్ర దర్యాప్తునకు పిలుపునిచ్చిందని తెలిపారు.
‘నేను అనేకసార్లు అధ్యక్షులిద్దరితో మాట్లాడాను, శాంతి కోసం విజ్ఞప్తి చేయడమే కాకుండా నేరుగా చర్చలు జరపాలని సూచించాను. మా దేశ పార్లమెంట్లోనూ ఉక్రెయిన్పై విస్తృతంగా చర్చించాం. తాజాగా బుచా హత్య వార్త చాలా ఆందోళన కలిగించింది. రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న చర్చలు శాంతికి దారితీస్తాయని మేము ఆశిస్తున్నాము. ఉక్రెయిన్ అభ్యర్థన మేరకు మేము మందులు, ఉపశమన సామగ్రిని కూడా పంపాము. అతి త్వరలో ఔషధాలను పంపిస్తాం’ అని మోదీ తెలిపారు.
అయితే అమెరికా విధిస్తున్న ఆంక్షలు గురించి ప్రధాని మోదీ ఈ సంభాషణల్లో ప్రస్తావించకపోవడం గమనార్హం. భారత్-అమెరికా సంబంధాల ప్రాముఖ్యతను వివరిస్తూ ‘గత దశాబ్దాల్లో ఊహకు అందనంతగా భారత్-అమెరికా సంబంధాల్లో పురోగతి కనిపిస్తోంది’ అని పేర్కొన్నారు.
భారత్-అమెరికా భాగస్వామ్యం అనేక ప్రపంచ సమస్యల పరిష్కారానికి దోహదపడుతుందని గత సెప్టెంబర్లో అమెరికా అధ్యక్షులు చెప్పిన మాటలను ప్రధాని గుర్తుచేశారు. ‘ఈ రెండు ప్రజాస్వామ్య దేశాలు ప్రపంచంలో అతి పెద్ద, ప్రాచీన సహజ భాగస్వాములు’ అని మోదీ చెప్పారు.
వర్చువల్ సమావేశాన్ని ప్రారంభిస్తూ అమెరికా అధ్యక్షులు బైడెన్ మాట్లాడుతూ ‘బలమైన, ప్రధాన రక్షణ భాగస్వామ్యాన్ని పంచుకోవడంలోనూ.. కోవిడ్, వాతావరణ మార్పులు వంటి ప్రపంచ సమస్యలు గురించి ఈ రెండు ప్రజాస్వామ్య దేశాలు ఒకే విధమైన భావాలను పంచుకుంటున్నాయి’ అని చెప్పారు.
అలాగే, ఉక్రెయిన్లోని మానవతా సంక్షోభాన్ని, ప్రధానంగా బుచా నగరంలో మారణహోమాన్ని ప్రస్తావిస్తూ, రష్యా దూకుడును తగ్గించడం, అదుపులో ఉంచడంపై భారత్-అమెరికాలు తమ సన్నిహిత సహకారాన్ని కొనసాగించాలని బైడెన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ వర్చువల్ సమావేశంలో ఇరు దేశాల విదేశాంగ, రక్షణ మంత్రులు, అమెరికాలో భారత రాయబారి తరన్జీత్ సంధూ కూడా పాల్గన్నారు.
కాగా, సోమవారం ‘భారత్-అమెరికా 2ప్లస్ 2 మంత్రిత్వ శాఖ చర్చలు’ జరగనున్నాయి. ఈ వార్షిక ద్వైపాక్షిక చర్చల్లో భారత్ తరపున విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గననున్నారు. అమెరికా తరపున రక్షణ మంత్రి ల్లోయడ్ అయుస్టిన్, విదేశాంగ మంత్రి అంటోనీ బ్లింకెన్ పాల్గొన్నారు.