సుమారు 51 బిలియన్ డాలర్ల విదేశీ రుణాలను చెల్లించలేమని శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది. విదేశీ రుణాలతో పాటు ఇతర రుణాలను డిఫాల్ట్‌గా ప్రకటించింది. అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) ఆర్థిక సహాయం అందించడానికి ముందు విదేశీ ప్రభుత్వాల నుండి రుణాలతో సహా అన్ని బాధ్యతల నుండి దేశం నిష్క్రమించనుందని శ్రీలంక ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.
దేశ ఆర్థిక పరిస్థితి మరింత క్షీణించకుండా నిరోధించడానికి చివరి ప్రయత్నంగా ప్రభుత్వం అత్యవసర చర్యను తీసుకుందని ఆ శాఖ తెలిపింది. తీవ్ర ఆర్థిక, ఆహార, ఇంధన కొరతతో అల్లాడుతోన్న శ్రీలంకలో పరిస్థితులు మరింత దిగజారకుండా ఉండేందుకు తాజా చర్యలు చేపట్టామని తెలిపింది. రుణదాతలు తమకు చెల్లించాల్సిన రుణాలను క్యాపిటలైజ్ చేసుకోవచ్చు లేదా శ్రీలంక రూపాయిల్లో చెల్లింపును ఎంచుకోవచ్చని వెల్లడించింది.
రుణాల చెల్లింపులు సవాళ్లతో కూడుకున్నదే కాకుండా అసాధ్యం అనే స్థితికి చేరిపోయామని, రుణాలను పునర్నిర్మించడంతోపాటు పూర్తి డీఫాల్ట్‌ను నివారించడమే ప్రస్తుతం తీసుకోగలిగిన ఉత్తమ చర్య అని శ్రీలంక సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ పీ నందాలాల్ వీరసింఘే పేర్కొన్నారు. చిత్తశుద్ధితోనే ఈ చర్యలు తీసుకుంటున్నామని చెబుతూ 2.2కోట్ల జనాభా కలిగిన శ్రీలంక ప్రభుత్వం రుణాల చెల్లింపులను గతంలో ఎన్నడూ ఎగవేయలేదని పునరుద్ఘాటించారు.
స్వాతంత్య్రం అనంతరం ఎన్నడూ లేనంతగా శ్రీలంక ప్రభుత్వం తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. నిత్యావసరాలైన ఆహారం, ఇంధనం కొరతతో పాటు విద్యుత్ కోతలతో ప్రజలు అల్లాడుతున్నారు. వేలాది మంది ప్రజలు ప్రభుత్వ నేతల నివాసాల ఎదుట ఆందోళన చేపడుతున్నారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు రబ్బరు బుల్లెట్లు, టియర్గ్యాస్ని ప్రయోగించారు.
కరోనా లాక్‌డౌన్‌తో పర్యాటకరంగంపై తీవ్ర ప్రభావం పడటంతో అత్యవసర వస్తువులను దిగుమతి చేసుకోవడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.