దేశంలోనే పెద్దపులులకు ఆవాస కేంద్రమైన నల్లమల్ల అటవీ ప్రాంతంలో పెద్దపులులతో పాటు వన్యప్రాణులు వేసవి వచ్చిందంటే దాహార్తితో అలమటిస్తుంటాయి. ముందస్తుగానే అటవీశాఖ అధికారులు నామ మాత్రపు చర్యలు చేపట్టి వన్యప్రాణుల దాహార్తిని తీర్చేందుకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నా ప్రయోజనం ఉండడం లేదు.
అభయారణ్యంలో ఉండాల్సిన పెద్దపులి దాహం తీర్చుకునేందుకు జనావాసంలోకి వచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. వన్యప్రాణుల దాహార్తిని తీర్చేందుకు అటవీశాఖ నిధులను ఎంత ఖర్చు చేస్తుంది అనే లెక్కల్లో నేటికీ స్పష్టత లేదు.
కేంద్ర ప్రభుత్వం దేశంలో పెద్ద పులుల సంరక్షణ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా నల్లమల అటవీ ప్రాంతంలోని నాగార్జునసాగర్.. శ్రీశైలం పెద్దపులుల అభయారణ్యంగా ప్రకటించింది. దేశవ్యాప్తంగా పరిచయమైన ఈ శాంచారి నల్లమల సొంతం. వాస్తవంగా ఇక్కడ పెద్దపులుల సంతతి తగ్గిపోతుండగా.. ప్రతి సంవత్సరం అటవీశాఖ అధికారులు పులుల లెక్కింపు చేస్తారు.
వేసవిలో పెద్ద పులుల మనుగడ దినదినగండంగా మారుతోంది. అడవుల్లో నీటి లభ్యత ఆవాసాలు లేకపోవడంతో జనారణ్యంలోకి వస్తున్న సమయంలో వాహనాలు ఢీకొని మృత్యువాత పడుతున్నాయి.
నల్లమల అటవీ ప్రాంతంలోని నంద్యాల జిల్లా పరిధిలో గల ఆత్మకూరు డివిజన్ ఆత్మకూరు, వెలుగోడు, బైర్లూటి, నాగలూటి, శ్రీశైలం రేంజిలో పెద్ద పులుల సంతతి అధిక సంఖ్యలో ఉంటుందని అటవీశాఖ అధికారుల గణాంకాలు తెలుపుతున్నాయి.
40 డిగ్రీల ఉష్ణోగ్రతతో ఎండలు మండుతున్న ఈ పరిస్థితుల్లో నంద్యాల, కర్నూల్, ప్రకాశం, గుంటూరు జిల్లాలలో గల నల్లమల్ల పై తీవ్ర ప్రభావం చూపుతోంది. అభయారణ్యంలో 3,568 చదరపు కి.మీ విస్తరించి ఉన్న తమ ఆవాసాలను పెద్ద పులులు వీడి నీటి కోసం మైదానం ప్రదేశాల వైపు వస్తున్నాయి.
ఈ వలస పయనంలో వన్యప్రాణుల మధ్య నీటి యుద్ధం, సరిహద్దుల వివాదం నెలకొంటోంది. ఆధిపత్య పోరులో పెద్ద పులులు చిరుతలు ఎలుగుబంట్లు ఇతర వన్యప్రాణులు మరణిస్తున్నాయి. మరోవంక, వేసవికాలంలో వేటగాళ్లు మాటువేసి జంతువులను మట్టి పెడుతున్నారు.