షెహబాజ్ షరీఫ్‌ను పాకిస్తాన్ ప్రధానమంత్రిగా ఎన్నికవడంపై అభినందించిన రెండవ విదేశీ నాయకుడు (టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ తర్వాత) భారత ప్రధాని నరేంద్ర మోదీ. పాకిస్థాన్‌తో తీవ్రవాద రహిత సత్సంబంధాలను కోరుకొంటున్నట్లు తెలిపారు. అందుకు ప్రతిస్పందిస్తూ, ఈ ప్రాంతంలో శాంతి కోసం కాశ్మీర్ సమస్యకు పరిష్కారం అవసరమని షరీఫ్ పేర్కొన్నారు.
భారత దేశంతో శాంతిని నెలకొల్పడానికి పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు జనరల్ కమర్ జావేద్ బజ్వా చేసిన నిరంతర ప్రయత్నాలకు మోదీ-షెహబాజ్ పరస్పర సందేశాలు తోడవుతున్నాయి. మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ కూడా భారత్‌తో సత్సంబంధాలు కోరుకున్నా భారత్, అమెరికాల పట్ల అనుసరించే విధానాల విషయంలోనే సైన్యం ఆగ్రహానికి గురయినట్లు తెలుస్తున్నది.
పాకిస్థాన్ లో చాలాకాలంగా రక్షణ, విదేశాంగ విధానాలను అక్కడి సైన్యమే నిర్దేశిస్తుంది. కేవలం సైన్యం మద్దతుతో అధికారంలోకి వచ్చిన ఇమ్రాన్ ఖాన్ ఈ విషయంలో సైన్యం విధానాలకు భిన్నంగా వ్యవహరిస్తూ వారి ఆగ్రహానికి గురికావడం, చివరకు పదవి పోగొట్టుకోవలసి రావడం జరిగిన్నట్లు పరిశీలకులు భావిస్తున్నారు.
2019లో మధ్యవర్తుల ద్వారా పాకిస్థాన్ పర్యటన జరిపేందుకు ప్రధాని మోదీ హామీ ఇచ్చారని సీనియర్ పాకిస్థాన్ జనరల్స్ ఈ మధ్య ఒక సందర్భంలో ఓ భారతీయ రచయితకు వెల్లడించారు. అందువల్లనే, వింగ్ కమాండర్ వర్థమాన్ అభినందన్. ఫిబ్రవరి 2019లో బాలాకోట్‌పై భారత వాయుసేన వైమానిక దాడుల తర్వాత ఆలస్యం లేకుండా పాక్ విడుదల చేసిన్నట్లు పేర్కొన్నారు.
అయితే, ఆగస్ట్ 2019లో జమ్మూ కాశ్మీర్ రాజ్యాంగ హోదాను మార్చడం పాకిస్థాన్ ప్రణాళికలను తారుమారు చేసింది. కోపోద్రిక్తుడైన ఇమ్రాన్ ఖాన్ బహిరంగంగా మోదీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ద్వైపాక్షిక సంబంధాలను తగ్గించారు. అయితే, జనరల్ బజ్వాకు చైనా జనరల్ సెక్రటరీ జీ జిన్‌పింగ్ ఓపిక పట్టాలని సలహా ఇచ్చారు.
బ్రిటన్ నుంచి హాంకాంగ్‌ను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి చైనాకు 98 ఏళ్లు పట్టిందని, పోర్చుగల్ నుంచి మకావును స్వాధీనం చేసుకోవడానికి 103 ఏళ్లు పట్టిందని జిన్‌పింగ్ ఈ సందర్భంగా బజ్వాకు చెప్పారు. ఏదేమైనా, జనరల్ బజ్వా పాకిస్తాన్ సైన్యం పాకిస్తాన్ జాతీయ భద్రతా విధానంపై దృష్టి సారించాలని, రెండు కారణాల వల్ల భారతదేశంతో శాంతిని కొనసాగించాలని నిర్ణయించిన్నట్లు తెలుస్తున్నది.
ఒకటి, భారతదేశంతో వాణిజ్యాన్ని అభివృద్ధి చేయడం. ఇది జాతీయ భద్రతను సాధించడంలో సహాయపడుతుంది; రెండు, మారిన యుద్ధం సవాళ్లను ఎదుర్కొనేందుకు పాకిస్తాన్ సైన్యాన్ని ఆధునీకరించడం. ఇది ఫిబ్రవరి 2021 నుండి భారతదేశం, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణకు దారితీసింది.
జనరల్ బజ్వా ఈ మధ్య ఓ సందర్భంలో మాట్లాడుతూ, పాకిస్తాన్ సైన్యం చేసిన ఒక ప్రధాన అధ్యయనం ఫలితంగా, ప్రస్తుతం 5,38,000గా ఉన్న పాకిస్తాన్ సైన్యం ప్రస్తుత బలాన్ని గణనీయంగా ఐదు సంవత్సరాలలో తగ్గించాలని నిర్ణయించినట్లు చెప్పారు. మిలిటరీని, ముఖ్యంగా ఫైర్‌పవర్, సైబర్ ఆధునికీకరణ పట్ల దృష్టి కేంద్రీకరించాలని భావించారు.
పాకిస్తాన్ సైన్యం టూ-స్టార్ ఆఫీసర్ కింద సైబర్ విభాగాన్ని కలిగి ఉండగా, వైమానిక దళం, నావికాదళం ద్వారా ఇలాంటి సంస్థలను ఏర్పాటు చేసి, హైబ్రిడ్ వార్ఫేర్లో లక్ష్యంగా సివిల్ డొమైన్లో ఉండే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు.
ముషారఫ్ నాలుగు అంశాల ఫార్ములా ప్రకారం కాశ్మీర్ అంశంపై ద్వైపాక్షిక చర్చలకు పాక్ సైన్యం సుముఖంగా ఉన్నట్లు తెలుస్తున్నది. అయితే, మొత్తం సంబంధాలను మెరుగుపరచడంలో సహాయపడే చర్చల పట్ల ఆసక్తి కనబరిచారు.అయితే, భారత్‌తో శాంతి కోసం తన ఆర్మీ చీఫ్ రోడ్‌మ్యాప్‌తో ఇమ్రాన్ ఖాన్ ఏకీభవించలేదని తెలుస్తున్నది.
ముషారఫ్ ఫార్ములా, క్లుప్తంగా, నాలుగు దశలను కలిగి ఉంది: మొదట, భారతదేశం, పాకిస్తాన్ రెండూ పరిష్కారం అవసరమైన ప్రాంతాలను గుర్తించాలి. రెండవది, హింస స్థాయిని తగ్గించడంలో సహాయపడే గుర్తించిన ప్రాంతాలను సైనిక రహితం చేయడం.
మూడవది, గుర్తించిన ప్రాంతం/లలో స్వీయ-పరిపాలన లేదా స్వయం పాలనను ప్రవేశ పెట్టడం. చివరిది, స్వపరిపాలనను పర్యవేక్షిస్తున్న భారతీయులు, పాకిస్తానీలు, కాశ్మీరీలతో కూడిన ఉమ్మడి నిర్వహణ యంత్రాంగాన్ని కలిగి ఉండడం. స్వయం-పరిపాలన పరిధికి మించిన అన్ని గుర్తించిన ప్రాంతాలకు సాధారణ విషయాలతో వ్యవహరిస్తుంది.
పాకిస్తాన్ అమెరికా, రష్యా విధానాలపై కూడా జనరల్ బజ్వా, ఇమ్రాన్ ఖాన్ విభేదించిన్నట్లు తెలుస్తున్నది. జనరల్ బజ్వా అమెరికా, చైనా రెండింటితో సత్సంబంధాలకు ప్రాధాన్యత ఇవ్వగా, ఇమ్రాన్ ఖాన్ చైనా , దాని వ్యూహాత్మక భాగస్వామి రష్యాతో సంబంధాలను కోరుకున్నారు. రష్యాను సందర్శించ వద్దని అమెరికా చేసిన హెచ్చరికలను ఖాన్ తిరస్కరించారు. పైగా, పాకిస్తాన్లో పాలన మార్పును అమెరికా కోరుకుంటోందని ఆరోపించారు.
అమెరికాతో సంబంధాల విషయంలో పాకిస్తాన్ చేదు అనుభవాన్ని ఎదుర్కొంటున్నా, తమ ఆర్థిక వ్యవస్థ స్థితిని బట్టి, ఆ దేశంతో సంబంధాలు ముఖ్యమైనవిగా మారాయి. పాకిస్తాన్ సైన్యం ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) గ్రే లిస్ట్ నుండి బయటపడేందుకు ఆసక్తిగా చూసింది. అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్ వంటి అనేక ఎఫ్ఏటీఎఫ్ సభ్యుల నుండి సైనిక సామగ్రిని కోరుతోంది. మరోవైపు, ఆఫ్ఘనిస్తాన్‌లో పాకిస్థాన్ సైనిక స్థావరాలను అమెరికా కోరుతుందని ఖాన్ ఆరోపించాడు.
అయితే అమెరికా- చైనాల మధ్య వివాదాలు ముదురుతూ ఉండడం పాకిస్థాన్ ను ఇరకాటంలో పడవేస్తుంది. దీర్ఘకాల ప్రయోజనాల దృష్ట్యా రష్యాకు దగ్గర కావడం అవసరమే అయినప్పటికీ. సైన్యం – పౌర పాలనా యంత్రాంగం పరస్పరం అవగాహనతో విదేశీ, రక్షణ వ్యూహాలను రూపొందించుకోవడం చాలా అవసరం. ఈ విషయంలో ఇమ్రాన్ ఖాన్ ధోరణులు ప్రతిబంధకాలుగా పాక్ సైన్యం భావించినట్లు కనిపిస్తున్నది.