రైతుల సంక్షేమ పథకాలు తుంగలో తొక్కిన ఘనత సీఎం కేసిఆర్దేనని వైఎస్ఆర్ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల విమర్శించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటన చేస్తున్న ఆమె మాట్లాడుతూ రెండుసార్లు తెలంగాణ ప్రజలు కేసీఆర్కు అధికారం ఇస్తే ఏం చేశారని ప్రశ్నించారు. షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర 58వ రోజైన ఆదివారం కొత్తగూడెం నియోజకవర్గం సుజాతనగర్ మండలంలో కొనసాగింది.
సుజాత నగర్ గ్రామంలో నిర్వహించిన రైతు గోస ధర్నాలో షర్మిల పాల్గొంటూ కేసీఆర్ చెప్పిన ఒక్క మాట, చేసిన ఒక్క సంతకంతో రాష్ట్రంలో సుమారు 17లక్షల మంది రైతులు నష్టపో యారని ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేశానని సీఎం చెబుతున్నారని, మరి రైతుల ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయని ఆమె నిలదీశారు. 8 సంవత్సరాలలో వేల మంది ఆత్మహత్య చేసుకున్నారంటే కోటీశ్వరులై., కార్లు ఎక్కువై ఆత్మహత్యలు చేసుకున్నారా..? అని షర్మిల ప్రశ్నించారు.
బ్యాంకుల వాళ్లు ఇళ్లకు వచ్చి తాళాలు వేసి అప్పుల కోసం వేధిస్తుంటే, అవమానాలు భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని షర్మిల ఆందోళన వ్యక్తం చేశారు. వరి వేసుకుంటే ఉరే అని చెప్పిన కేసీఆర్ .. ఏ పంట వేసుకున్నా లాభాలు వచ్చే పరిస్థితి లేదంటున్నా పట్టించుకోవడం లేదని ఆమె ధ్వజమెత్తారు. రూ.25 వేలు ఇచ్చే పథకాలు ఆపేసి రూ. 5 వేలు రైతుబంధు ఇస్తున్నారని ఆమె విమర్శించారు. కౌలు రైతుకు రుణాలు, రైతుబంధు ఇవ్వడంలేదని షర్మిల ప్రశ్నించారు.
వరి పంట వేయొద్దని రైతులకు చెప్పి కేసీఆర్ మోసం చేశారని ఆమె ధ్వజమెత్తారు. వరి వేయని రైతులకు ముఖ్యమంత్రి ఎకరానికి రూ.25 వేలు ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. రైతులు తక్కువ ధరకు ధాన్యాన్ని అమ్ముకున్నారని చెబుతూ మద్దతుధరతో పాటు బోనస్ కలిపి రైతులకు చెల్లించాలని ఆమె స్పష్టం చేశారు.
కౌలు రైతులను రైతుల్లా చూస్తున్నారా..? భూమి లేని పేద రైతులు కౌలు రైతులు, ఉన్న భూములు అమ్ముకుని కౌలుకు చేసుకుంటున్న నిరుపేద భూములు లేని కౌలు రైతులను ఆదుకునే ఆలోచనే చేయడం లేదని ఆమె విమర్శించారు. కౌలు రైతులకు రుణాలు లేవు.. రైతు బంధు లేదు.. ఏ ఒక్క సహాయం అందడం లేదని షర్మిల మండిపడ్డారు.
వరికొనుగోళ్లపై ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి వ్యాఖ్యలపై మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొంటుంది కాబట్టి ఎవరూ మాట్లాడ కూడదని, ఎవరైనా టీఆర్ఎస్ గురించి తప్పుగా మాట్లాడితే వరి కంకులతో కొట్టాలని పల్లా అన్నారని, వరి సాగు చేయకుండా అడ్డుకున్న కేసీఆర్ను ఏ జెప్పులతో, ఏ చీపురుతో కొట్టాలని ప్రశ్నించారు.
స్థానిక ఎమ్మెల్యే కొడుకు అరాచకాలతో ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని మండిపడుతూ ఎమ్మెల్యే, ఆయన కొడుకుపై ఎందుకు చర్యలు తీసుకోలేదని షర్మిల ప్రశ్నించారు.