పరిహారం కోసం కేంద్రంపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా రాష్ట్రాలు తమ ఆదాయాన్ని పెంచుకునేందుకు జిఎస్టి కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకోనుంది. ప్రస్తుతం ఉన్న ఐదు శాతం శ్లాబ్‌ను తొలగించే ప్రతిపాదనను పరిశీలించే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
వచ్చే నెలలో జరగనున్న జిఎస్టి కౌన్సిల్ సమావేశంలో ఈ నిర్ణయాన్ని తీసుకోనున్నట్లు సమాచారం. 5 శాతం పరిధిలోకి వచ్చే వినియోగదారులను 3 శాతం, 8 శాతం వర్గాలుగా విభజించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జిఎస్టిలో 5,12.18,28 శాతం పన్ను శ్లాబులున్నాయి. బంగారం, బంగారం ఆభరణాలపై 3 శాతం పన్ను విధిస్తున్నారు.
ప్యాక్ చేయని, బ్రాండెడ్ కాని ఆహార, డైరీ ఉత్పత్తులు ప్రస్తుతం జిఎస్టి నుండి మినహాయింపు రాష్ట్రాల ఆదాయాన్ని పెంచేందుకు ఆహారేతర వస్తువులను 3 శాతం శ్లాబ్ పరిధిలోకి తీసుకురావాలని కేంద్రం యోచిస్తున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి.
5 శాతం శ్లాబ్‌ని 7 శాతం లేదా 8 శాతం లేదా 9 శాతాలకు పెంచాలన్న యోచన కూడా ఉందని.. అయితే కేంద్ర, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రులతో చర్చల అనంతరం తుదినిర్ణయాన్ని ప్రకటించనుందని ఆవర్గాలు తెలిపాయి.
5 శాతం శ్లాబుని 8 శాతానికి పెంచడం వల్ల ప్రభుత్వానికి ఏటా అదనంగా రూ.1.50 లక్షల కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం జిఎస్టి లెక్కల ప్రకారం అతి తక్కువ పన్ను శ్లాబును 1 శాతం పెంచితే అదనంగా రూ.50 వేల కోట్ల ఆదాయం సమకూరుతుంది.
జిఎస్టి మినహాయింపు వర్తిస్తున్న వస్తువుల సంఖ్యను సైతం తగ్గించే అవకాశం ఉన్నందున ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉందని ఆ వర్గాలు వెల్లడించాయి.
జులై 1, 2017న జిఎస్టి చట్టం అమల్లోకి వచ్చింది. అప్పటి నుండి ఐదేళ్లు అంటే జూన్, 2022 వరకు జిఎస్టి అమలు వల్ల ఆదాయాన్ని నష్టపోయిన రాష్ట్రాలకు పరిహారం చెల్లిస్తామని కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే.
దీనికి 2015-16 నాటి రాష్ట్రాల ఆదాయం ఆధారంగా ఏటా 14 శాతం వృద్ధిని పరిగణనలోకి తీసుకొని నష్టాన్ని లెక్కిస్తామని తెలిపింది. అయితే గత ఐదేళ్లలో పరిశ్రమ, వ్యాపార వర్గాల డిమాండ్‌తో పలు వస్తువులపై జిఎస్టి రేట్లను తగ్గించాల్సి వచ్చింది.
దీంతో ఆదాయం తగ్గి రాష్ట్రాలకు లోటు ఏర్పడింది. తొలుత 28 శాతం పరిధిలో ఉన్న వస్తువుల సంఖ్య 228గా ఉండగా.. ఇప్పుడది 35కు తగ్గింది. దీంతో జిఎస్టి శ్లాబ్‌లను హేతుబద్ధీకరించాలన్న డిమాండ్ పెరిగింది.