ఆంధ్ర ప్రదేశ్ కు వరప్రసాదంగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్ట్ ఇప్పట్లో పూర్తయ్యే అవకాశం కనబడటం లేదు. వాస్తవానికి 2018 నాటికే పూర్తిచేయాలనుకున్నా, 2020కు వాయిదా పడింది. 2022 గడుస్తున్నా పూర్తయ్యే అవకాశాలు కనబడటం లేదు. ముఖ్యంగా రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత ప్రాజెక్ట్ నత్తనడకన నడుస్తున్నది. దానితో 2024 ఎన్నికల లోపుకూడా పూర్తయ్యే అవకాశాలు కనబడటం లేదు.
అందుకు ప్రధానంగా రెండు అవరోధాలు కనిపిస్తున్నాయి. ప్రాజెక్ట్ నిర్మాణం టిడిపి హయాంలో శరవేగంగా చేపట్టినా నిర్వాసితుల పునరావాసం మాత్రం కొలిక్కి రాలేదు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి కొనసాగుతున్నది. ప్రాజెక్ట్ వ్యయంకన్నా నిర్వాసితుల పునరావాసంకు ఎక్కువ వ్యయం కానున్న దృష్ట్యా ఆ మొత్తాన్ని ఎవ్వరు భరించాలని విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక అవగాహనకు రాలేక పోతున్నాయి.
మరోవంక ప్రాజెక్ట్ డిజైన్ ఆమోదం పలు అవరోధాలను ఎదుర్కొంటున్నది. డ్యాం డిజైన్ లో దేశవ్యాప్తంగా ప్రఖ్యాతి చెందిన ఇంజనీరింగ్ నిపుణులు, సంస్థలు రూపొందించిన డిజైన్ ప్రతిపాదనలపై ఇంతవరకు ఏకాభిప్రాయం రాకపోవటమే దీనికి ప్రధాన కారణం.
కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ), డీడీఆర్పీ (డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్), పోలవరం ప్రాజెక్టు అధారిటీ (పీపీఏ), సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ (సీఎస్ఎంఆర్ఎస్), సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ (సీడబ్ల్యూపీఆర్ఎస్), ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ చెన్నై ఇంజనీరింగ్ నిపుణులతో కూడిన కమిటీ సైతం ఇంతవరకు డిజైన్లను కొలిక్కి తీసుకురాలేకపోయింది.
కేంద్ర జలశక్తి ప్రత్యేకంగా నియమనించిన ఢిల్లీ ఐఐటీ మాజీ డైరెక్టర్, రిటైర్డు ప్రొఫెసర్ వీఎస్ రాజు నేతృత్వంలోని కమిటీ చేసిన సిఫార్సులపైనా భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావటంతో డిజైన్ వివాదం మళ్లీ మొదటికొచ్చింది. 2020లో గోదావరిలో వరద పోటెత్తింది.
ఊహించని స్థితిలో 23 లక్షల క్యూసెక్కుల వరద ఉదృతికి అప్పటికే ఆమోదం పొంది నిర్మాణంలో ఉన్న డయాఫ్రం వాల్ దెబ్బతింది. నదీగర్భం కోతకు గురయింది. డయాఫ్రం వాల్ చుట్టూ సుడులు ఏర్పడి భారీ గొయ్యి ఏర్పడింది.
పోలవరం ప్రాజెక్టులో కీలక నిర్మాణమైన ఎర్త్ కమ్ రాక్ ఫిల్ (ఈసీఆర్ఎఫ్) డ్యామ్ గ్యాప్-1, గ్యాప్-2కు సమీపంలో కోతకు గురయిన నదీ గర్భాన్ని తిరిగి పటిష్ట స్థాయిలో పూడ్చటం ఇపుడు ఇంజనీరింగ్ నిపుణులకు సవాల్ గా మారింది. సాంకేతికంగా ఎలాంటి ఇబ్బంది ఎదురైనా మున్ముందు ప్రాజెక్టు దెబ్బతినే అవకాశం ఉంది.
అందువల్లనే ఈ విషయంలో కేంద్ర జలశక్తి ఆచితూచి వ్యవహరిస్తోంది. ఫలితంగా గ్యాప్-2లో 550 మీటర్లు, గ్యాప్-1లో 1,750 మీటర్ల పొడవున ప్రధాన డ్యామ్ డిజైన్ల తుది ఆమోదం వాయిదా పడుతూ వస్తోంది. నీటిని తోడకుండానే గుంతలు ఉన్న ప్రదేశాల్లో పొరలు పొరలుగా ఇసుక వేస్తూ డెన్సిఫికేషన్ చేయటం వల్ల కోతకు గురయిన ఇసుకపొరలన్నీ పటిష్టమవుతాయని వెల్లడిస్తూ వైబ్రో కాంపక్షన్, డెన్సిఫికేషన్, స్టోన్ కాలమ్ విధానాలను వి.ఎస్ రాజు నేతృత్వంలోని కమిటీ ప్రతిపాదించింది.
దీనిపై డీడీఆర్పీ (డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్) చైర్మన్ ఏబీ పాండ్యతో పాటు మరికొందరు ఇంజనీరింగ్ నిపుణులు అనేక్ సందేహాలు లేవనెత్తారు. దీంతో ఇప్పటికే నిర్వహించిన సమావేశాలన్నీ అసంపూర్తిగా ముగియటంతో కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ సలహాదారు వెదిరె శ్రీరాం నేతృత్వంలో ప్రత్యేక బృందం కోతకు గురయిన ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు ఈనెల 22, 23న పోలవరంలో పర్యటిస్తోంది.
