జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ త్వరలోనే తెలంగాణ ప్రాంతంలో పర్యటిస్తారని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ- ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఇటీవల ప్రమాదవశాత్తు మరణించిన ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఇద్దరు క్రియాశీలక జనసైనికుల కుటు-ంబాలను పరామర్శించి, ఆర్థిక సాయం చెక్కులు అందిస్తారని వెల్లడించారు.
హైదరాబాద్ పార్టీ కేంద్ర కార్యాలయంలో తెలంగాణ నాయకులు, వీరమహిళలతో ఆయన సమావేశమవుతూ తెలంగాణ ప్రాంతమన్నా, ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలన్నా అధ్యక్షులు పవన్ కల్యాణ్‌కు చాలా మక్కువని చెప్పారు. ఈ ప్రాంత పోరాట పటిమను స్ఫూర్తిగా తీసుకోవాలని ప్రతి సమావేశంలో ఆయన ప్రస్తావిస్తూనే ఉంటారని వివరించారు.
ఈ ప్రాంతంలో పేదరికం, వెనుకబాటుతనం, సమస్యలను స్వయంగా చూశారని, ఆదిలాబాద్, నల్గొండ, వరంగల్ జిల్లాల్లో తాగడానికి కూడా నీళ్లు లేని పరిస్థితులు ఆయనకు తెలుసునని తెలిపారు. అందుకనే ఆదిలాబాద్ తండాలో అక్కడి మహిళలు అడగ్గానే మంచినీటి బోరు ఏర్పాటు చేశారని గుర్తు చేశారు.
కోరుకుంటే నాయకత్వం రాదని, దానికోసం మనస్ఫూర్తిగా కష్టపడాలని, ప్రణాళికతో వ్యూహాత్మకంగా ప్రజా సమస్యలపై గళం వినిపించాలని, అప్పుడు సమస్యలపై అవగాహన పెరగడంతో పాటు ప్రజల్లో ఆదరణ పెరుగుతుందని మనోహర్ దిశానిర్దేశం చేశారు.
ప్రభుత్వమే రైతులను రక్షించాలి
ఇలా ఉండగా, ఎపిలో రోజూ అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని.. అప్పుల ఊబిలో ఉన్న రైతులను రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అప్పుల బాధ భరించలేక ఆత్మహత్య చేసుకోవడం విషాదకరమని చెప్పారు.
విధులు నిర్వర్తించడంలో వ్యవస్థలు విఫలమవుతున్నాయని ఆయన విచారం వ్యక్తం చేశారు. రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి రాకుండా అవి పని చేయాలని కోరారు. ఎన్నికల సమయంలో వైసిపి రూ.50 వేల కోట్ల పెట్టుబడి హామీ ఇచ్చిందని.. అది ఏమైందని పవన్ ప్రశ్నించారు.
ఇప్పటివరకు ఎన్ని కుటుంబాలకు పంట పెట్టుబడి అందించారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రయివేట్ వడ్డీ వ్యాపారుల వద్ద రైతులు అప్పులు చేసి ఊబిలో కూరుకుపోతున్నారనిచెబుతూ అన్నం పెట్టే రైతులను కూడా కులాల వారిగా విభజిస్తారా? అని పవన్ ప్రశ్నించారు.