ఉత్తర ఢిల్లీలోని జహంగీర్‌పూరీలో జరిగిన మత ఘర్షణలకు విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ పేర్లు రావడం రాజకీయంగా కలకలం రేపుతున్నది. వారు అనుమతి లేకుండా హనుమాన్ జయంతి సందర్భంగా శోభాయాత్ర జరిపారని పేర్కొంటూ ప్రకటన విడుదల చేసిన పోలీసులు, తర్వాత దానిని వెనుకకు తీసుకున్నారు.
ఆ తర్వాత ఆ పేర్లు లేకుండా మరో ప్రకటన విడుదల చేశారు. హనుమాన్ జయంతి రోజున సాయంత్రం అనుమతి లేకుండా ర్యాలీని చేపట్టినందుకు నిర్వాహకులపై ఢిల్లీ పోలీసులు సోమవారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాగా, శనివారం నాటి హింసాత్మక ఘటనలకు సంబంధించి నమోదైన రెండవ కేసు ఇది.
ర్యాలీ నిర్వాహకులపై ఐపిసిలోని 188 సెక్షన్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వారిలో ఒకరిని విచారిస్తున్నట్లు ఈశాన్య ఢిల్లీ డిసిపి ఉషా రంగానీ తెలిపారు. అయితే, శనివారం ఉదయం, మధ్యాహ్నం చేపట్టిన మరో రెండు ఊరేగింపులకు తగిన అనుమతి ఉందని ఆమె చెప్పారు.
అనుమతి లేకుండా మతపరమైన ఊరేగింపు జరిపినందుకు విశ్వహిందూ పరిషత్, భజరంగ్‌దళ్ సభ్యులపై కేసు నమోదు చేసినట్లు డిసిపి అంతకముందు అధికారిక ప్రకటన చేశారు. స్థానిక విహెచ్పి నేత ప్రేమ్ శర్మను అరెస్టు చేసినట్లు కూడా పేర్కొన్నారు.
కాగా, అనంతరం ఆ ప్రకటనను ఉపసహంరించుకున్న పోలీసులు, ఐపిసిలోని 188 సెక్షన్ కింద బెయిలబుల్ అని పేర్కొంటూ విచారణ వ్యక్తిని ప్రశ్నించి తర్వాత వదిలిపెట్టారు. పోలీసులు సవరించిన ప్రకటనలో విహెచ్పి, భగరంగ్దళ్ పేర్లు లేకపోవడం గమనార్హం
కాగా, రెండవ ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో తమ కార్యకర్తలకు వ్యతిరేకంగా కేసులు బనాయించడంపై కోర్టుకు వెళతామని వీహెచ్‌పీ ప్రతినిధి వినోద్ బన్సాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమపై కేసు నమోదు చేయాలని “లౌకిక, ముస్లిం నాయకుల” నుండి ఢిల్లీ పోలీసులపై ఒత్తిడి వస్తోందని ఆయన ఆరోపించారు. ఆ ప్రాంతం గుండా శోభాయాత్ర చేపట్టేందుకు అనుమతి తీసుకోలేదని ఢిల్లీ పోలీస్ కమిషనర్ రాకేష్ అస్థానా చేసిన ప్రకటన “నిరాధారం” అని స్పష్టం చేశారు.
కాగా, హింసాకాండ కేసులో ప్రధాన నిందితుడిగా పేర్కొన్న అన్సార్ బిజెపి నాయకుడని ఆప్ ఎమ్మెల్యే అతిషి ఆరోపించారు. “జహంగీర్‌పురి అల్లర్లలో ప్రధాన నిందితుడు అన్సార్ బిజెపి నాయకుడు. బీజేపీ అభ్యర్థి సంగీతా బజాజ్‌ను పోటీకి దింపడంలో ఆయన ప్రధాన పాత్ర పోషించారు. బీజేపీలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు” అని స్పష్టం చేశారు. జహంగీర్‌పురి అల్లర్ల వెనుక బీజేపీ హస్తం ఉందని పేర్కొంటూ ఢిల్లీ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ `బీజేపీ గూండాల పార్టీ’ అని అతిషి ట్వీట్లో పేర్కొన్నారు.
కీలక నిందితులకు ఆమ్ ఆద్మీ పార్టీతో సంబంధాలున్నాయని బీజేపీ కూడా ఆరోపించిన నేపథ్యంలో ఇది జరిగింది. “దాడి సూత్రధారి… అన్సార్, ఆప్ కార్యకర్త అని తేలింది. ఇందుకు సంబంధించిన ఆధారాలు ఫోటోల రూపంలో ఉన్నాయి. 2020 ఢిల్లీ అల్లర్లకు సూత్రధారి అయిన తాహిర్ హుస్సేన్ కూడా ఆప్ కౌన్సిలర్. ఆప్ అల్లర్ల ఫ్యాక్టరీని నడుపుతుందా? అని బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ ఆరోపించారు.
ఢిల్లీ బీజేపీ అధికార ప్రతినిధి ప్రవీణ్ శంకర్ కపూర్ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు లేఖ రాస్తూ, “యువకుడు, స్పష్టంగా ఆప్ కార్యకర్త ప్రమేయంపై ఆప్ నాయకత్వం నుండి ప్రజలు సమాధానం కోరుకుంటున్నారు…” అని పేర్కొన్నారు. దీనిపై ఆప్ అధికార ప్రతినిధి సౌరభ్ భరద్వాజ్ స్పందిస్తూ, “ఆమ్ ఆద్మీ పార్టీ చేపట్టిన శోభాయాత్రలో ఎక్కడా ఇలాంటి సంఘటన జరగలేదు. దీన్నిబట్టి బీజేపీ అల్లర్లకు పాల్పడుతోందని స్పష్టమవుతోంది” అని ఆరోపించారు.