తెలంగాణ గవర్నర్ డా. తమిళసై సౌందరరాజన్ మీడియా సమావేశాలలో రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తుండటం పట్ల మంత్రి తలసాని శ్రీనివాసరావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. “మీరు గవర్నర్ గా వ్యవహరిస్తున్నారా? రాజకీయ నాయకులా? అంటూ ప్రశ్నించారు.
తనకు, ముఖ్యమంత్రి కేసీఆర్ కు మధ్య అంతరం ఏర్పడినట్లు చైన్నైలో ఓ సమావేశంలో ఆమె చెప్పడం పట్ల విస్మయం వ్యక్తం చేశారు. రాజ్యాంగ పదవిలో ఉన్న మీరు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వంపై ఇటువంటి విమర్శలు ఏమిటని మంత్రి నిలదీశారు. ఓ రాజకీయ నాయకురాలి వలే ఆమె ముఖ్యమంత్రి గురించి మాట్లాడటం మంచిది కాదని హితవు చెప్పారు.
ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం పై ఆరోపణలు చేయడం సరికాదని స్పష్టం చేశారు. రాజ్యాంగం పరంగా తన బాధ్యత నిర్వర్తించాలని ఆయన కోరారు. ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలు తమవని చెబుతూ నామినేటెడ్ వ్యక్తులం కాదని ఘాటుగా స్పందించారు.
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు లాంటి వారే ప్రోటోకాల్ విషయంలో కొన్నిపరిమితులు ఉంటాయి అన్నారని చెబుతూ అది కూడా గవర్నర్ తెలుసుకొని మాట్లాడాలని తలసాని కోరారు. అయితే ప్రొటోకాల్ విషయంలో అధికారులకే బాధ్యత ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు.
రాజ్యాంగ పరమైన విధానంలో కాంగ్రెస్ విధానం ఏంటి? అని ప్రశ్నించారు. ప్రతిపక్షాలకు పని పాట లేదని మండిపడ్డారు. పొద్దున లేస్తే సోషల్ మీడియా లో ప్రచారం తప్ప వేరే లేదంటూ మంత్రి తలసాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.