ఐటీవల తెలంగాణలోని 40 రైస్ మిల్లుల్లో ఎఫ్సీఐ అధికారులు తనిఖీలు చేస్తే 4,53,896 ధాన్యం సంచులు మాయమైనట్టు తేలిందని కేంద్ర మంత్రి జి కిషన్రెడ్డి వెల్లడించారు. ఆ ధాన్యం సంచులు ఏమయ్యాయో స్పష్టత కావాలని, ఆయా రైస్ మిల్లర్లపై రాష్ర ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో చెప్పాలని ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ ను నిలదీశారు.
నిబంధనల ప్రకారం మిల్లుల్లో ఎంత బియ్యం నిల్వ ఉండాలో అంత ఉండటం లేదని చెబుతూ రైస్ మిల్లులపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ వ్రాసినా స్పందన లేదని చెప్పారు. మిల్లుల్లో జరుగుతున్న అక్రమాలపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలంటూ ఓ నాయకుడు తనకు లేఖ రాశారని గుర్తు చేశారు.
వాస్తవానికి రైస్ మిల్లులు రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయని, దర్యాప్తునకు ఆదేశించే అధికారం కేంద్రానికి లేదని కిషన్రెడ్డి తెలిపారు. కాగా, 40 లక్షల మెట్రిక్ టన్నుల రా రైస్ పంపిస్తామని ఈ నెల 14న తెలంగాణ పౌర సరఫరాల శాఖ కమిషనర్ కేంద్రానికి లేఖ రాయగా వరుస సెలవులు ఉన్నా వెంటనే స్పందించి బదులిచ్చామని కిషన్ రెడ్డి వెల్లడించారు.
రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ఇస్తామన్న బియ్యాన్ని కొనడానికి కేంద్రం సిద్ధంగా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం అందుకు సంబంధించిన ఏర్పాట్లేమీ చేయలేదని కేంద్ర మంత్రి విమర్శించారు. గోనె సంచుల కొరత, తూకం వేసే పరికరాలు లేవు, వర్షం వస్తే తడవకుండా కాపాడే టార్పాలిన్ కవర్లు లేవన్న కేంద్రమంత్రి, వీటన్నిటినీ జనవరి నుంచే సేకరించి పెట్టుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యానికి 15 కోట్ల గోనె బస్తాలు కావాల్సి ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం వద్ద కనీసం కోటి బస్తాలు కూడా లేవని వెల్లడించారు. గోనె సంచులు లేకుండా బియ్యాన్ని తట్టల్లో పడతారా? అని ఎద్దేవా చేశారు. ధాన్యం సేకరణకు సంబంధించి ఫిబ్రవరి నుంచి కేంద్రం అనేక సమావేశాలు నిర్వహించినా సరే, రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోగా ఉల్టా తమ మీదే పచ్చి అబద్ధాలతో ఆరోపణలు చేస్తూ వచ్చిందని కిషన్రెడ్డి విమర్శించారు.
ఈ జాప్యం కారణంగా రైతులు తక్కువ ధరకు ధాన్యం అమ్ముకోవాల్సి వచ్చిందని, అందుకు బాధ్యులెవరని ప్రశ్నించారు. ధాన్యం సేకరణపై అనవసర రాద్ధాంతం చేసి రైతుల జీవితాలతో చెలగాటమాడారని దుయ్యబట్టారు. దేశమంతటా ఒకే విధానం ఉందని నొక్కి చెప్పిన కేంద్రమంత్రి, ఇకపై బాయిల్డ్ రైస్ సేకరణ కుదరదని అన్ని రాష్ట్రాలను ఒప్పించిన విషయం గుర్తు చేశారు.
ముడిబియ్యం విషయంలో కేంద్రం మొదట్నుంచీ స్పష్టమైన వైఖరితో ఉందని లిఖితపూర్వకంగా రాసిచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే తొండాట ఆడుతూ, సీఎం ఢిల్లీ వచ్చి మరీ ధర్నాలు చేశారని మండిపడ్డారు. రైతులకు ఇబ్బంది కలిగించవద్దనే ఉద్దేశంతో తాము వ్యవహరిస్తుంటే సీఎం మొండికేసి కాలయాపని చేశారని చెప్పుకొచ్చారు.
హుజురాబాద్ లో ఓడిన తర్వాత బీజేపీ మీద అనేక రకాలుగా తప్పుడు ప్రచారం మొదలుపెట్టారని, రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేశారు.