ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, టీడీపీ నేత బోండా ఉమాకు ఆంధ్ర ప్రదేశ్ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 27న విచారణకు హాజరుకావాలని మహిళా కమిషన్ ఆదేశాలు ఇచ్చింది. విజయవాడ గ్యాంగ్‌రేప్ బాధితురాలి పరామర్శ సమయంలో వాగ్వాదం జరిగింది.
విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో అత్యాచార బాధితురాలిని పరామర్శించే క్రమంలో మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మను అగౌరవపరచడం.. బాధితురాలి ఆవేదన విననీయకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారని, అత్యాచార బాధితురాలిని భయకంపితం చేసిన సంఘటనలపై విచారణకు చంద్రబాబు, బొండా ఉమ వ్యక్తిగతంగా హాజరుకావాలని మహిళా కమిషన్ సమన్లు జారీ చేసింది.
ఈనెల 27న ఉదయం 11 గంటలకు మంగళగిరిలోని రాష్ట్ర మహిళా కమిషన్ కార్యాలయానికి చంద్రబాబు, బొండా ఉమ స్వయంగా విచారణకు కావాలని మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ సమన్లలో ఆదేశించారు.
కాగా, టిడిపి అధినేత పరామర్శకు వెళ్లే సమయానికి మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ బాధితురాలితో మాట్లాడుతున్నారు. దీంతో చంద్రబాబు కొద్దిసేపు పక్కన నిల్చున్నారు. పద్మ పరామర్శ కొనసాగుతుండటంతో తనకు అవకాశమిస్తే మాట్లాడి వెళ్లిపోతానని విజయవాడ పోలీస్ కమిషనర్‌ను కోరారు. మాజీ ముఖ్యమంత్రిని ఇంతసేపు నిలుచోబెట్టడం సరికాదని టిడిపి నేత బోండా ఉమా చెప్పారు.
ఈ సమయంలో మహిళా కమిషన్‌కు, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా టిడిపి కార్యకర్తలు నినాదాలు చేశారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి కార్యకర్తలను అదుపు చేశారు. ఈ క్రమంలో ప్రభుత్వాసత్రి గేటు అద్దాలు పలిగిపోయాయి. అనంతరం పద్మ అక్కడ నుండి వెళ్లిపోవడంతో చంద్రబాబు పరామర్శించారు. అనంతరం పద్మ మాట్లాడుతూ తనను చంద్రబాబు, తెలుగుదేశం కార్యకర్తలు బెదిరించారని ఆరోపించారు. ఆస్పత్రిలో నానాయాగీ చేశారని విమర్శించారు.
విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో రెండు రోజుల పాటు ఓ యువతిపై ముగ్గురు అఘాయిత్యానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదుతో ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బాధిత కుటుంబానికి ప్రభుత్వం రూ.10 లక్షల ఆర్థికసాయం ప్రకటించింది. ప్రభుత్వం తరపున బాధితురాలి కుటుంబానికి ఇల్లు కట్టి ఇస్తామని మంత్రి జోగి రమేష్ తెలిపారు.
బాధితురాలి తల్లికి తగిన ఉద్యోగం ఇస్తామని చెప్పారు. నిందితులకు ఉరిశిక్ష పడేలా చూస్తామని ప్రకటించారు. టీడీపీ అధినేత చంద్రబాబు శవరాజకీయాలు చేయడం మానుకోవాలని జోగి రమేష్ ఈ సందర్భంగా సూచించారు. విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో రెండు రోజుల పాటు ఓ యువతిపై ముగ్గురు అఘాయిత్యానికి పాల్పడ్డారు. వీరిలో ఇద్దరు సిబ్బంది ఉన్నారు.
మానసిక స్థితి సరిగా లేని ఓ యువతిని పరిచయం చేసుకుని ప్రేమ పేరుతో ఓ ఉద్యోగి దగ్గరయ్యాడు. పెళ్లి చేసుకుంటానని, తాను పనిచేసే ఆస్పత్రిలో ఉద్యోగం ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి నమ్మించాడు.
ఎవరికీ తెలియకుండా ఆస్పత్రికి రప్పించి ఓ చిన్న గదిలో ఉంచాడు. ఆ యువకుడు, తోటి ఉద్యోగి, ఉద్యోగి స్నేహితుడు ముగ్గురూ ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. యువతి తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.