ఫ్రాన్స్ అధ్యక్షుడిగా ఇమాన్యుయెల్ మాక్రాన్ మరోసారి ఎన్నికయ్యారు. వరుసగా రెండోసారి సార్లు అధ్యక్ష పదవికి ఎన్నికైన తొలి అధ్యక్షుడిగా ఆయన రికార్డు సృష్టించారు. నాటో వ్యతిరేక, వలస వ్యతిరేక వైఖరి తీసుకున్న మితవాద నాయకురాలు లీ పెన్కు ఇది వరుసగా రెండవ సారి ఓటమి.
మాక్రాన్‌కు 58.2 శాతం ఓట్లు పోల్ కాగా, లీపెన్‌కు 41. 8 శాతం ఓట్లు మాత్రమే వచ్చినట్లు ఎగ్జిట్ పోల్స్, ప్రాథమిక ఓట్ల లెక్కింపు సరళి తెలియజేస్తున్నాయి. 2017 ఎన్నికల్లో వీరిద్దరి మధ్య తేడా 66.1- 33.9 శాతంగా ఉండేది. ఈ సారి ఆ మార్జిన్ కాస్తా తగ్గింది.
ఒక సారి అధ్యక్షుడిగా ఎన్నికైన వారికి రెండోసారి అవకాశం ఇవ్వడానికి ఫ్రాన్స్ ప్రజలు తిరస్కరించడం 2002 నుంచి ఆనవాయితీగా వస్తుంది. ఈ సారి దానికి బ్రేక్ పడింది. ఐదేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో మరీన్ లీపెన్‌పై గెలిచి 39 ఏళ్ల మాక్రాన్ ఫ్రాన్స్ లో అతిపిన్న వయసు గల అధ్యక్షుడిగా రికార్డులకెక్కాడు.
ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతున్న వేళ మాక్రాన్ రెండోసారి ఎన్నికవడం ఫ్రాన్స్ సహా యూరోపియన్ యూనియన్‌లో నాయకత్వ స్థిరత్వానికి హామీ ఇచ్చినట్టు అయిందని పలువురు భావిస్తున్నారు. “ఫ్రాన్స్ మా అత్యంత సన్నిహిత, ముఖ్యమైన మిత్రదేశాలలో ఒకటి. ఫ్రాన్స్ అధ్యక్షుడిగా మాక్రాన్ మళ్లీ ఎన్నికైనందుకు అభినందనలు” అని బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ తెలిపారు.
మాక్రాన్‌తో కలిసి ఫ్రాన్స్, ఐరోపాలను మరింత అభివృద్ధి చేస్తామని ఈయూ చీఫ్ ఉర్సులా వాన్‌డర్ లేయెన్ ట్వీట్ చేశారు. ఈయూ, నాటోలో విస్తృతమైన సహకారాన్ని కొనసాగించాలని ఆశిస్తున్నట్లు తెలిపారు.