ఉక్రెయిన్ యుద్ధం పేరుతో కొద్దిరోజులుగా వంటి నూనెల ధరలు గణనీయంగా పెరగడం కాకతాళీయం కాదని, నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తున్న `ఆత్మనిర్భర్ భారత్’ లో వంటనూనెలను దేశంలోనే లభించేటట్లు చూడటం పట్ల ఆసక్తి చూపక పోవడమే అని పరిశీలకులు భావిస్తున్నారు. స్వదేశంలో నూనెగింజల పంటలకు తగు ప్రోత్సాహం లేకపోవడంతో దేశీయ అవసరాలలో మూడింట రెండొంతులు ఆధారపడవలసి వస్తున్నది.
గత రెండేళ్లలో వంట నూనెల ధరలు రెట్టింపుకు పైగా పెరిగాయి. రూ 110 గా ఉన్న సన్ఫ్లవర్ ఆయిల్ ధర ఇప్పుడు రూ 230 అమ్ముతోంది. భారత్ వాడుకునే 23 మెట్రిక్ టన్నుల నూనెల్లో 15 మెట్రిక్ టన్నులు విదేశాల నుంచే దిగుమతి అవుతున్నాయి. కేవలం ఎనిమిది టన్నులను మాత్రమే దేశీయంగా ఉత్పత్తి చేసుకుంటున్నాం.
వంట నూనెల దిగుమతులలో మూడో ఆదానీ కంపెనీలు చేస్తుండడంతో, వాటి ప్రయోజనం కోసం దేశంలో ఉత్పత్తులు పెంచేందుకు ఆసక్తి చూపడం లేదనే విమర్శలు చెలరేగుతున్నాయి. గట్టి ప్రయత్నం చేసి ఉంటే ఐదేళ్లలోనే వంటనూనెల దిగుమతి భారాన్ని తగ్గించేవారని, గతంలో 1985 నాటి ప్రభుత్వం కేవలం నాలుగేళ్లలో దిగుమతులపై భారం తగ్గించిందని నిపుణులు పేర్కొంటున్నారు.
వంటనూనెల దిగుమతులు సమస్యాత్మకంగా ఉన్నాయని తెలిసినా, ఏడాదికి పది బిలియన్ డాలర్ల సొమ్మును దిగుమతుల కోసం ఖర్చు చేస్తున్నామని తెలిసినా వీటిని నిరుత్సాహపరిచే ప్రయత్నం జరగడం లేదు. పైగా, వీటి ధరల అదుపు పేరుతో దిగుమతుల సుంకం తగ్గించడంతో అదానీ విల్మర్ సంస్థ కరోనా కాలమైనప్పటికీ 2021లో 60 శాతం లాభాలను సాధించి దాదాపు రూ 800 కోట్లను వెనుకేసుకోవడం గమనార్హం.