సురక్షితం కాని లైంగిక సంపర్కం కారణంగా దేశంలో హెచ్ఐవి బారిన పడుతున్నవారి సంఖ్య లక్షల్లో నమోదవుతున్నది. సమాచార హక్కు చట్టం (ఆర్టిఐ) ద్వారా వెలువడ్డ ఈ సంఖ్య ఇప్పుడు ఆందోళనను కలిగిస్తున్నది. ఈ సమాచారం ప్రకారం అసురక్షిత లైంగిక సంపర్కం ద్వారా దేశంలో 17 లక్షల మందికి పైగా హెచ్ఐవీ బారిన పడ్డారు.
ఆర్టిఐ ప్రశ్నకు సమాధానంగా నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (ఎన్‌ఎసిఒ) ఈ సమాచారాన్ని వెలువర్చింది. మధ్యప్రదేశ్‌కు చెందిన చంద్రశేఖర్ గౌర్ ఆర్టీఐ కింద ఈ సమాచారాన్ని కోరారు.ఆర్టీఐ సమాచారం ప్రకారం.. 2011-2021 మధ్య భారత్‌లో మొత్తం 17,08,777 మంది హెచ్ఐవి బారిన పడ్డారు.
అయితే, గత పదేండ్లలో హెచ్ఐవీ బారిన పడిన వారి సంఖ్య తగ్గింది. 2011-12లో హెచ్ఐవీ సోకినవారు 2.4 లక్షల మంది ఉన్నారు. 2020-21లో అది 85,268కి పడిపోవటం గమనించాల్సిన అంశం. ఇక రాష్ట్రాలవారీగా చూసుకుంటే.. అత్యధిక హెచ్ఐవి కేసులు ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నాయి. ఇక్కడ 3,18,814 మంది ఈ మహమ్మారి బారిన పడ్డారు.
ఆ తర్వాతి స్థానంలో మహారాష్ట్ర (2,84,577 మంది), కర్నాటక (2,12,982 మంది), తమిళనాడు (1,16,536), యూపీ (1,10,911), గుజరాత్ (87,440)లు ఉన్నాయి. 2020 నాటికి, దేశంలో మొత్తం 23,18,737 మంది హెచ్ఐవితో జీవిస్తున్నారు. వీరిలో 81,430 మంది చిన్నారులూ ఉన్నారు. ప్రమాదకర ఎయిడ్స్ వ్యాధికి దారి తీసే హెచ్ఐవి మనిషి రోగ నిరోధక వ్యవస్థను దెబ్బతీస్తుంది.