తెలంగాణలో తొలి మహిళా యూనివర్సిటీ ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. కోఠి ఉమెన్స్ కాలేజీని మహిళా యూనివర్సిటీగా మారుస్తూ జీవో జారీ చేసింది. తెలంగాణలో అమ్మాయిలకు ఉన్నతవిద్యలో అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం మహిళా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసింది.
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ మహిళా వర్సిటీ ఏర్పాటుపై ఉన్నత విద్యామండలి అధికారులతో భేటీ అయిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉత్తర్వుల ప్రతిని ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ రవీందర్ కు అందజేశారు. వర్సిటీ ఏర్పాటుకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.100 కోట్లు కేటాయించినట్లు ఆమె చెప్పారు.
ఈ విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా కొత్త కోర్సులు ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించారు. ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి ఆధ్వర్యంలో విధివిధానాలు రూపొందించాలని మంత్రి సబిత ఆదేశించారు. బోధన సౌకర్యాలు విద్యార్థులకు మౌలిక సదుపాయాలు సమకూర్చాలని చెప్పారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి మహిళా యూనివర్సిటీ అందుబాటులోకి వస్తుందని మంత్రి స్పష్టం చేశారు.
మహిళా విద్యాభివృద్ధి లక్ష్యంగా ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 1983లో తిరుపతిలోని పద్మావతి మహిళా కళాశాలను విశ్వవిద్యాలయంగా మార్చారు. అది దేశంలోనే రెండో మహిళా యూనివర్సిటీ. తద్వారా ఉమ్మడి రాష్ట్రంలో గ్రామీణ యువతులకు సామాజిక, సాంకేతిక, వైజ్ఞానిక శాస్త్ర రంగాల్లో అరుదైన కోర్సులను అభ్యసించే అవకాశం లభించింది.
తెలంగాణ ఆవిర్భావం అనంతరం ఆడపడుచులకు ప్రత్యేక విశ్వవిద్యాలయం లేకపోవడంతో చాలా విమర్శలొచ్చాయి. ఫుడ్ అండ్ న్యూట్రీషన్, ఆర్కిటెక్ట్ తదితర కోర్సుల్లో తెలంగాణలో ఉన్నత విద్యావకాశాలు అంతగా లేకపోవడం వల్ల కొందరు ఇతర రాష్ట్రానికి వెళ్లాల్సి వస్తోంది.
అమ్మాయిలను ఉన్నత చదువు కోసం బయట రాష్ట్రాలకు పంపడానికి చాలా కుటుంబాలు అభ్యంతరం తెలపడంతో ఆడపిల్లల కలలు కల్లలుగానే మిగిలిపోతున్నాయి. కాగా, కోఠి ఉమెన్స్ కాలేజీని అమ్మాయిలకు ఉచిత ఉన్నత విద్యావకాశాలను కల్పించడం ద్వారా వాళ్లకు మరింత మేలు కలుగుతుందని టీఆర్ఎస్ ప్రభుత్వం భావించింది.