స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ అంతర్జాతీయ సామాజిక మాధ్యమం ‘ట్విటర్’ను సొంతం చేసుకున్నారు. 44 బిలియన్ డాలర్లతో ట్విటర్‌ను కొనుగోలు చేయడానికి సోమవారం ఒక ఒప్పందం కుదిరినట్లు ది వాల్‌స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. పబ్లిక్ సంస్థగా వ్యవహరించిన ట్విటర్ ఇకపై మస్క్ యాజమాన్యంలో ప్రైవేట్ కంపెనీగా మారుతుందని ట్విటర్ ఒక ప్రకటనలో తెలిపింది.
ఒక్కో షేరు 54.20 డాలర్లతో కొనుగోలు చేసేందుకు చర్చలు జరిపినట్లు పేర్కొంది. రెండు వారాల క్రితమే ఈ సంస్థలో 9.2% వాటా కొనుగోలు చేసినట్లు ప్రకటించారు. ప్రస్తుతం సంస్థ మొత్తాన్నీ తన అధీనంలోకి తీసుకున్నారు.ఫేస్బుక్, టిక్‌టాక్‌తో పోలిస్తే తక్కువ మంది యూజర్లున్నప్పటికీ, సెలెబ్రిటీలు, రాజకీయ నాయకులు, జర్నలిస్టల ఖాతాలతో ట్విటర్‌కు ప్రపంచవ్యాప్తంగా అమిత ప్రాచుర్యం లభించింది.
ట్విటర్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్న మస్క్ కూడా ట్విటర్ యూజర్లలో ఒకరు. ఈ వేదికలో ఆయనకు 8.1 కోట్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. వాక్ స్వేచ్ఛకు వేదిక అవుతుందన్న నమ్మకంతోనే కంపెనీలో పెట్టుబడులు పెట్టానని, కాకపోతే ప్రస్తుత స్థితిలో కంపెనీ వాక్ స్వేచ్ఛను పెంచకపోవడమే కాదు, కల్పించనూ లేదని పెట్టుబడులు పెట్టాక తనకు అవగతమైందంటూ ట్విటర్ చైర్మన్ బ్రెట్ టేలర్‌కు రాసిన లేఖలో మస్క్ పేర్కొన్నారు.
లిస్టెడ్ కంపెనీగా ఉన్న ట్విటర్‌ను ప్రైవేట్ కంపెనీగా మారాల్సిన అవసరం ఉందని.. అందుకే సంస్థను పూర్తిగా కొనుగోలు చేయాలనుకుంటున్నట్లు లేఖలో ప్రతిపాదించారు. వాక్ స్వాతంత్య్రం, స్వేచ్ఛగా అభిప్రాయాల వ్యక్తీకరణ కోసం వేదికగా ఏర్పాటైన ట్విటర్ ప్రస్తుతం ఆ లక్ష్యాలకు విరుద్ధంగా పనిచేస్తోందంటూ మస్క్ కొన్నాళ్లుగా విమర్శలు గుప్పిస్తున్నారు.
వాక్ స్వాతంత్య్రానికి మరింత అనువైన వేదికగా దాన్ని తీర్చిదిద్దుతానని ఉద్ఘాటించారు. కొనుగోలు ఒప్పందం వార్తల నేపథ్యంలో ట్విటర్ షేరు సోమవారం 3 శాతం పెరిగింది. ట్విటర్ కొనుగోలు నిధులను బ్యాంకుల ద్వారా మస్క్ సమకూర్చుకున్నట్లు పత్రిక పేర్కొంది.