ఎప్పుడు ఎన్నికలు జరిగినా తెలంగాణాలో తాము అధికారంలోకి రావడం ఖాయం అంటూ బిజెపి నాయకులు ప్రకటనలు చేయడమే కానీ ఆచరణలో ఆ దిశలో అడుగులు వేయడం లేదని స్పష్టం అవుతున్నది. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ స్థానాలలో కనీసం 70 స్థానాలను దక్కించుకునేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వీడుతున్నట్లు ప్రకటించిన నాయకులు అందుకోసం చూపిన ప్రణాళిక ప్రకారం అడుగులు వేయడం లేదు.
ముఖ్యంగా `మిషన్ 31′ పేరుతో ఎస్సి, ఎస్టీ రిజర్వేడ్ నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించి, వాటిని గెలిపించుకోవడం కోసం ఇప్పటి నుండే బలమైన అభ్యర్థులను గుర్తించాలని నిర్ణయించారు. ఎందుకంటె వీటులో ఏ పార్టీ ఎక్కువ నియోజకవర్గాలు గెల్చుకొంటుందో ఆ పార్టీయే ఉమ్మడి ఏపీలో కూడా అధికారంలోకి వస్తున్నది.
ఇందులో 19ఎస్సీ నియోజకవర్గాలు కాగా 12ఎస్టీ నియోజకవర్గాలున్నాయి. ఈ నియోజకవర్గాలలో బీజేపీ మొదటి నుంచి అంతంత మాత్రంగానే ఉంది. తొలుత ఈ నియోజకవర్గాలలో పట్టు సాధించాలని నిర్ణయించిన నాయకత్వం మిషన్ 19, మిషన్ 12 పేరిట కమిటీలను వేసింది. మిషన్ 19కి మాజీ ఎంపీ ఏపీ జితేందర్, మిషన్ 12కు మరో మాజీ ఎంపీ గరికపాటి మోహన్రావులకు బాధ్యతలను అప్పగించారు.
ఈ రెండు కమిటీలు ఏం చేయాలి, ఆయా నియోజకవర్గాలలో పార్టీని ఏ రకంగా బలోపేతం చేయాలన్న అంశాలపై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడితో పాటు పలువురు నేతలు మేధో మధనం చేసి కొన్ని మార్గదర్శకాలను రూపొందించారు. ఈ మార్గదర్శకాల అమలుపై జనవరి మాసంలో రెండు రోజుల పాటు వర్క్షాప్ను కూడా నిర్వహించారు.
బలమైన అభ్యర్థులను గుర్తించడం, పార్టీకి పట్టులేని ప్రాంతాలలో చేపట్టాల్సిన చర్యలు, ఇతర పార్టీలకు చెందిన వారిని ఆకర్షించడం కోసం తీసుకోవాల్సిన చర్యలు, ప్రజా సమస్యలను గుర్తించి పోరాటాలకు శ్రీకారం చుట్టడం ఇలా అనేక నిర్ణయాలు తీసుకున్నారు. జనవరిలో జరిగిన భేటీ తర్వాత ఇప్పటి వరకు ఆ కమిటీలకు బాధ్యులైన వారు ఆ నియోజకవర్గాల వైపు కన్నెత్తి చూసిన దాఖలాలు లేవు.
తెలంగాణలో చాల నియోజకవర్గాలలో సరైన, సామర్ధ్యం గల ఇన్ ఛార్జ్ లనే నియమించలేదు. ఆ విధంగా నియమిస్తే వారే ఎన్నికలలో పార్టీ అభ్యర్థులు అనే సంకేతం ఇచ్చిన్నట్లు అవుతుందని, దానితో మిగిలిన వారు పార్టీకి దూరం కావడమో, ఇతర పార్టీల నుండి వచ్చి చేరాలి అనుకున్నవారు వెనుకడుగు వేయడమే జరగవచ్చని జంకుతున్నారు. దానితో మీడియాలో కనిపిస్తున్న హడావుడి క్షేత్రస్థాయిలో 2023 ఎన్నికల సన్నాహాలకు సంబంధించి కనిపించడం లేదు.