బీమా రంగ ప్రభుత్వ దిగ్గజం ఎల్ఐసీలో 3.5 శాతం వాటా విక్రయంకు రంగం సిద్ధమైంది. ఈ పబ్లిక్ ఆఫర్ మే 4న మొదలై మూడు రోజుల పాటు కొనసాగుతుంది. ఇష్యూ ప్రైస్‌ను రూ. 902–-949 మధ్య నిర్ణయించారు. ఇన్వెస్టర్లను ప్రోత్సహించేందుకు రిటైల్ పెట్టుబడిదారులకు, పాలసీదారులకు రాయితీలను ప్రకటించారు.
ఆఫర్ద్వారా రూ.21 వేల కోట్ల విలువైన 22 వేల కోట్ల షేర్లను అమ్ముతుంది. కాబట్టి మన దేశంలో ఇప్పటి వరకు వచ్చిన ఐపీఓల్లో ఇదే అతి పెద్దది అవుతుంది. మొదట 5 శాతం షేర్లను అమ్మాలని అనుకున్నా ఉక్రెయిన్ యుద్ధం దృష్ట్యా అంతర్జాతీయ మార్కెట్లలో ఏర్పడిన ఒడిదొడుకులు దృష్ట్యా వాయిదా వేయడంతో పాటు, అమ్మాలనుకున్న మొత్తాన్ని కూడా తగ్గించారు.
ప్రస్తుత పరిస్థితుల్లో ఇదే సరైన పరిమాణమని దీపమ్ కార్యదర్శి తుహిన్ కాంత పాండే పేర్కొన్నారు. తద్వారా ఐపీవోలోకి ఒక్కసారిగా భారీ పెట్టుబడులు తరలి వచ్చేందుకు వీలుండదని తెలియజేశారు. ప్రస్తుత సమస్యాత్మక మార్కెట్ వాతావరణంలో ఎల్ఐసీ వాటా విక్రయాన్ని రూ. 20,557 కోట్లకు పరిమితం చేయడం సరైన చర్యగా పేర్కొన్నారు.
ఇష్యూకి ధరల శ్రేణి రూ. 902–949గా నిర్ణయించారు. పాలసీదారులు, ఉద్యోగులు, రిటైలర్లకు ఇష్యూ ధరలో రూ. 60–40 వరకూ రాయితీని ప్రకటించింది. ఎల్ఐసీ.. మే 17న స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్ట్ కానున్నట్లు మార్కెట్ వర్గాల అంచనా. ఇన్వెస్టర్లు ఎల్ఐసీ ఐపీఓ కోసం మే 4 నుండి మే 9 వరకు బిడ్డింగ్ వేయవచ్చు.
మే 4న యాంకర్ ఇన్వెస్టర్ల కోసం ఇష్యూ ఓపెన్ అవుతుంది. ఇదే నెల 16న షేర్లు క్రెడిట్అవుతాయి. మరునాడు షేర్లను లిస్ట్ చేస్తారు. ఈ మేరకు మంగళవారం జరిగిన బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని ఎల్ఐసీ వర్గాలు తెలిపాయి.
పది రూపాయల ఫేస్‌వాల్యూ కలిగిన కంపెనీ ఈక్విటీ షేరు ధరను రూ. 902 నుండి రూ. 949 మధ్య నిర్ణయించారు. రిటైల్ ఇన్వెస్టర్లకు, ఎల్ఐసీ ఉద్యోగులకు ఒక్కో షేరుపై రూ.45 తగ్గింపు ఉంటుంది. పాలసీదారులకు ఒక్కో షేరుపై రూ.60 తగ్గింపు కూడా లభిస్తుంది. ఈ పబ్లిక్ ఆఫర్ మార్కెట్ లాట్ సైజును 15 షేర్లుగా నిర్ణయించారు. రిటైల్- ఇండివిడ్యువల్ ఇన్వెస్టర్ గరిష్టంగా 14 లాట్లు లేదా 210 షేర్లకు దరఖాస్తు చేసుకోవచ్చు.
రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (ఆర్‌హెచ్‌పీ) ప్రకారం 22,137,492 ఈక్విటీ షేర్లను (ఇష్యూలో 10 శాతం) ఎల్ఐసీ పాలసీదారుల కోసం కేటాయించారు. 15, 81,249 వరకు ఈక్విటీ షేర్లను( 0.70 శాతం) ఉద్యోగుల కోసం రిజర్వ్ చేశారు. సగం షేర్లను క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు (క్యూఐబీలు) ఇస్తారు. క్యూఐబీ భాగం నుండి
60 శాతం షేర్లను యాంకర్ పెట్టుబడిదారులకు ఇస్తారు. యాంకర్ ఇన్వెస్టర్ పోర్షన్లో మూడింట ఒక వంతు షేర్లను దేశీయ మ్యూచువల్ ఫండ్స్ కోసం కేటాయిస్తారు. దాదాపు 15 శాతం షేర్లను నాన్-ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు (ఎన్ఐఐ) ఇస్తారు. రిటైల్ ఇన్వెస్టర్లకు 35 శాతం షేర్లను కేటాయిస్తారు.
2022 ఫిబ్రవరి 28 నాటికి బీమా పాలసీకి పాన్‌కార్డు లింక్ అయిన ఎల్ఐసీ పాలసీదారులు ఈ మెగా ఐపీఓ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఎల్ఐసీ పాలసీదారులు గరిష్టంగా రూ. రెండు లక్షల విలువైన షేర్లకు బిడ్ వేయొచ్చు. పాలసీదారులకు రూ.60 చొప్పున తగ్గింపు ఉంటుంది. ఈ కోటా ఓవర్‌సబ్‌స్క్రయిబ్ అయినట్లయితే, దామాషా ప్రాతిపదికన కేటాయింపు ఉంటుంది.