విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ వారి ఆలయంలో భద్రతా లోపం వైఫల్యం మరోసారి స్పష్టమైంది. ప్రముఖ సినీ నటుడు రామ్ చరణ్ రాక సందర్భంగా అభిమానులు అంతరాలయంలోకి దూసుకెళ్లారు. శ్రీ అమ్మవారి ఆలయంలో జై భవానీ నినాదాలకు బదులుగా..జై రామ్ చరణ్ అంటూ నినాదాలు చేశారు.
మరో రెన్డు రోజులలో తండ్రి చిరంజీవితో కలసి నటించిన ఆచార్య చిత్రం విడుదల సందర్భంగా రామ్‌చరణ్ బుధవారం ఉదయం 11.15గంటలకు అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చారు.
భారీసంఖ్యలో తరలి వచ్చిన అభిమానులు రామ్‌చరణ్ కొండపైకి చేరుకోగానే హద్దులు దాటి ప్రవర్తించారు. అమ్మవారి ఆలయంలో ‘జై చరణ్.. జైజై చరణ్’ అంటూ నినాదాలు చేస్తూ వీరంగం చేశారు. రామ్‌చరణ్‌కు స్వాగతం పలికేందుకు వచ్చిన దుర్గగుడి ఈవో భ్రమరాంబను సైతం పక్కకు తోసేశారు.
కొందరు అభిమానులు చెప్పులు, బూట్లతో సహా ముఖమండపంలోకి వచ్చేశారు. రామ్‌చరణ్ అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించిన సమయంలో అభిమానులు పోటీలు పడుతూ హుండీలపైకి ఎక్కి మరీ మూలవిరాట్‌ను తమ మొబైల్ ఫోన్లలో ఫొటోలు, వీడియోలు చిత్రీకరించారు.
రామ్‌చరణ్ అంతరాలయంలో ఉన్న సమయంలో ఒక్కసారిగా అభిమానులంతా తోసుకురావడంతో తొక్కిసలాట జరిగి క్యూలైన్ల రెయిలింగ్ రాడ్లు విరిగిపోయాయి. పూలకుండీలు ధ్వంసమయ్యాయి. క్యూలైన్ రైలింగ్ రాడ్లను ఎక్కి మరీ లోనికి వెళ్లిన అభిమానులు సెల్ఫీలు తీసుకోవడం, వీడియోలు తీసుకున్నారు.
పలువురు అభిమానులు పవిత్రమైన హుండీలపైకెక్కి రామ్ చరణ్‌ను చూసేందుకు పోటీలు పడటంతో అమ్మవారి దర్శనం కోసం వచ్చిన భక్తులు తీవ్ర అసౌకర్యానికి లోనయ్యారు. ఆయన వస్తున్నారని విషయం తెలిసిన రామ్‌చరణ్ అభిమానులు పెద్దఎత్తున ఆలయానికి తరలివచ్చారు.
రామ్ చరణ్ అమ్మవారి దర్శనం చేసుకునే సమయంలో ఒక్కసారిగా అభిమానులు నెట్టుకురావడంతో రైలింగ్ రాడ్లు విరిగాయి. వీరిని కట్టడి చేయడంలో పోలీసులు, ఆలయ భద్రతా సిబ్బంది విఫలమయ్యారు. కొందరు రైలింగ్ రాడ్ల పైనుంచి దూకి రామ్ చరణ్‌ను చేరుకొని సెల్ఫీలు దిగారు.
వీరి హడావుడితో క్యూలైన్లలో తొక్కిసలాట చోటు చేసుకొని సాధారణ భక్తులు బెంబేలెత్తారు. చివరకు పోలీసులు అభిమానులను చెదరగొట్టి రామ్ చరణ్‌ను దర్శనానంతరం ఆలయం వెలుపులకు తీసుకెళ్లారు.