హిందీ జాతీయ భాష అంటూ, అందరూ హిందీ నేర్చుకోవాలని, ఇంగ్లీష్ కు బదులు హిందీలోనే ఉత్తర ప్రత్యుత్తరాలు జరపాలని ఇటీవల కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా చేసిన వాఖ్యలు దేశంలో పలు ప్రాంతాలలో భాషా వివాదాన్ని తెరపైకి తెస్తున్నది. తాజాగా బిజెపి అధికారంలో ఉన్న కర్ణాటకలో సహితం ఈ వివాదం చెలరేగింది. బిజేపికి చెందిన ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైతో పాటు ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు హిందీ జాతీయ భాష కాదని, దేశంలోని ఓ భాష మాత్రమే అని స్పష్టం చేశారు.
నటులు అజయ్ దేవగన్, కిచ్ఛా సుదీప్‌ల ట్వీటు సంవాదంలో ఈ రాజకీయ నేతలు కూడా పాలుపంచుకున్నారు. హిందీ ఇతర భాషల లాగా నే దేశంలో ఓ భాష అని, దీనిని జాతీయ భాషగా అంతా అంగీకరించాల్సిన అవసరం లేదని బొమ్మై, కుమారస్వామి, సిద్ధరామయ్యలు స్పష్టం చేశారు. హిందీకి ప్రాధాన్యత ఇచ్చే పట్టుతో ఇతర భాషలను చిన్నచూపు చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ హిందీ వాదానికి కన్నడ నటుడు సుదీప్ ఇచ్చిన జవాబుతో వీరు ఏకీభవించారు. హుబ్బళ్లిలో ముఖ్యమంత్రి బస్వరాజ్ విలేకరులతో మాట్లాడుతూ సుదీప్ చెప్పింది నిజమే అని స్పష్టం చేశారు. రాష్ట్రాలు భాషాప్రయుక్త ప్రాతిపదికన ఏర్పాటు అయ్యాయి. తరువాత ప్రాంతీయ భాషలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయని గుర్తు చేశారు.
ప్రాంతాలలో ప్రజలు మాట్లాడుకునే భాషలు పైగా యాసలు కూడా తమ ప్రాబల్యాన్ని చాటుకున్నాయి. ఇది తిరుగులేని అంశం. దీనినే కన్నడ నటుడు సుదీప్ కూడా తెలిపారని, ఈ వాదన సముచితం దీనికి అంతా కట్టుబడాలి, గౌరవించాల్సిందే అని సిఎం స్పష్టం చేశారు. హిందీని తాము ఎప్పుడూ జాతీయ భాషగా అంగీకరించలేదుని, ఇక ముందు అంగీకరించేది లేదని సిఎం తేల్చి చెప్పారు.
దేశ భాషా వైవిధ్యతను భారతీయులంతా విధిగా గౌరవించాల్సిందే, ఇందులో ఎటువంటి ఆక్షేపణ ఉండరాదని కాంగ్రెస్ నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తేల్చిచెప్పారు. ప్రతి భాషకు ప్రత్యేక సుసంపన్న చరిత్ర ఉంటుందిని, దీనిని ఆయా స్థానిక ప్రజలు గౌరవంగా ఆపాదించుకుంటారని ఆయన చెప్పారు. తాను కన్నడిగుడిగా కన్నడ మాట్లాడేవాడిగా గర్విస్తున్నానని సిద్ధరామయ్య స్పష్టం చేశారు.
జనతాదళ్ (సెక్యులర్) నేత, మాజీ సిఎం అయిన కుమారస్వామి కూడా సుదీప్ మాటలను సమర్థించారు. హిందీ జాతీయ భాష అని చెప్పడాన్ని అంతా అంగీకరించాల్సిన పనిలేదని కన్నడ నటుడు సుదీప్ చెప్పింది సముచితమే. ఈ ప్రకటనలో తప్పేమీ లేదని అంటూ బాలీవుడ్ నటుడు తన వ్యాఖ్యలతో మనస్సులోని కుళ్లును, సంకుచితాన్ని వెదజల్లాడని విమర్శించారు.
కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, మరాఠీలాగానే హిందీ కూడా ఓ భాష అని, దీనిని కలిసికట్టుగా జాతీయ భాషగా అంతా అంగీకరించాల్సి రావడం కుదరదని తేల్చి చెప్పారు. భారతదేశం పలు భాషల విరితోట, బహుళ సంస్కృతుల సమ్మేళనపు ఇంద్రధనుస్సు. దీనిని విచ్ఛిన్నం చేసే యత్నాలకు ఎవరు యత్నించినా కుదరదని మాజీ సిఎం స్వామి తేల్చిచెప్పారు.
కేజీఎఫ్–2 సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్‌ని షేక్ చేసిన నేపథ్యంలో కన్నడ సినీ నటుడు, ఈగ ఫేమ్ సుదీప్, బాలీవుడ్ నటుడు అజయ్‌దేవగణ్ మధ్య ట్వీట్ల ద్వారా నడిచిన చర్చ రాజకీయ రచ్చకి దారితీసింది. హిందీ ఇక జాతీయ భాష కాదంటూ సుదీప్ చేసిన వ్యాఖ్యలపై బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్‌గణ్ స్పందిస్తూ అలాంటప్పుడు మీ సినిమాలు హిందీలోకి ఎందుకు డబ్ చేస్తున్నారని ప్రశ్నించారు. హిందీయే ఎప్పటికీ మన జాతీయ భాష అంటూ ట్వీట్ చేశారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య ట్వీట్లు స్నేహపూర్వకంగా నడిచినప్పటికీ దానిపై రాజకీయ దుమారం లేచింది.
