కరోనా కారణంగా అర్ధాంతరంగా స్వదేశానికి చైనా నుండి తిరిగి వచ్చి, గత రెండేళ్ళుగా తమ చదువు ఆగిపోయినదని ఆందోళన చెందుతున్న భారతీయ విద్యార్థులు తిరిగి వచ్చి, చదువులు తిరిగి కొనసాగించేందుకు చైనాకు రావొచ్చని ఆ దేశ ప్రభుతం ప్రకటించింది.
వీసా, ట్రావెల్ ఆంక్షల కారణంగా ఇప్పటి వరకు అనుమతించలేదు. మళ్లీ భారతీయ విద్యార్థులు చైనా వచ్చి చదువులు కొనసాగించేందుకు అనుమతిస్తున్నట్టు ఆ దేశ విదేశాంగ మంత్రిత శాఖ శుక్రవారం ప్రకటించింది. చదువులు కొనసాగించే విషయంలో.. భారత్ విద్యార్థులకు తొలి ప్రాధాన్యం ఇస్తున్నట్టు చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జావో లిజియన్ ప్రకటించారు.
అయితే, చైనాలో వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కొన్ని ఆంక్షలు, నిబంధనలు అమలు చేస్తున్నామని, ఇతర దేశాల విద్యార్థులకు కూడా వాటిని తెలియజేశామని పేర్కొన్నారు. భారతీయ అధికారులకు కూడా ఇక్కడి నిబంధనలు వివరించగా సానుకూలంగా స్పందించించారని తెలిపారు.
అయితే తమ దేశానికి తిరిగి వచ్చేందుకు ఇష్టపడే విద్యార్థుల జాబితాను భారతీయ అధికారులు ముందుగా అందజేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అంతర్జాతీయంగా ఉన్న కరోనా పరిస్థితులను పరిగణలోకి తీసుకుని విదేశీ విద్యార్థుల రాకపై నిర్ణయాలు తీసుకుంటున్నట్టు జావో తెలిపారు. దీనిపై భారత్‌లోని చైనా ఎంబసీ పని చేస్తోందని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో.. బీజింగ్‌లోని రాయబార కార్యాలయం చర్యలు చేపట్టింది. చైనాకు తిరిగి వెళ్లి చదువును ప్రారంభించే విద్యార్థుల వివరాలను తెలుసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. మే 8లోగా తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుందని సూచించింది.
ఈ జాబితాను చైనాకు అందించిన తరువాతే.. ఎవరికి అవకాశం ఇవ్వాలనేది ఆ దేశమే నిర్ణయిస్తుందని తెలిపింది. ఎవరికి ఆ దేశం అనుమతి ఇస్తే.. వారు అక్కడి నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాల్సి ఉంటుందని భారత్ ఎంబసీ స్పష్టం చేసింది.
ఈ సందర్భంగా అయ్యే ఖర్చులు కూడా విద్యార్థులే భరించాల్సి ఉంటుందని తెలిపింది. చైనాలో కరోనా కేసులు పెరిగిన తరువాత.. 23వేలకు పైగా విద్యార్థులు తిరిగి భారత్‌కు చేరుకున్నారు.