ఓ ప్రాపర్టీ షోను ప్రారంభిస్తూ ఏపీలో పరిస్థితులపై రాష్ట్ర ఐటి మంత్రి కె తారక రామారావు చేసిన వాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. పక్క రాష్ట్రం పరిస్థితులపై తన మిత్రుడు చెప్పిన విషయాలను కేటీఆర్ ప్రస్తావిస్తు ఏపీలో విద్యుత్ లేదని, నీళ్ళు లేవని, రోడ్లు ధ్వంసం అయ్యాయని, అక్కడి పరిస్థితి అధ్వాన్నంగా ఉందని హైదరాబాద్ నుండి తన ఊరుకి వెళ్లి వచ్చిన ఓ మిత్రుడు చెప్పాడని అంటూ ఏపీలోని పరిస్థితులపై వ్యంగ్యంగా చెప్పుకొచ్చారు.
దేశంలోనే `బెస్ట్ సిటీ’ హైదరాబాద్ అంటూ మరో రాష్ట్రం నుండి వచ్చిన ఓ బిజెపి ఎంపీ సహితం ఇక్కడి వలే ఫ్లై ఓవర్లు, మంచి రోడ్లు మరెక్కడా లేవని చెప్పారని తెలిపారు. బెంగళూరు కంపెనీలు కూడా ఏపీ రోడ్లపై మండిపడుతున్నారని చెప్పుకొచ్చారు.
రూపాయి లంచం లేకుండా అనుమతులు ఇస్తుంది తెలంగాణే ఒక్కటేనని పేర్కొంటూ పక్క రాష్ట్రాల్లో అధికార పార్టీకి, ప్రతిపక్ష పార్టీకి కూడా లంచాలు ఇస్తేనే అనుమతులు ఇస్తున్నారని ఆరోపించారు.
అయితే తన వాఖ్యలపై ఏపీ మంత్రుల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో స్పందించిన కేటీఆర్.. ట్విట్టర్ ద్వారా వివరణ ఇచ్చారు. ఎవరినో కించపరచాలనో, బాధపెట్టాలనో తాను ఆ వ్యాఖ్యలు చేయలేదని తెలిపారు. అన్యాపదేశంగా అవి తన నోటి వెంట వచ్చాయని చెబుతూ ఏపీ సీఎం జగన్ను తన సోదరుడిగా భావిస్తానని తెలిపారు. ఆయన నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందాలని మనసారా కోరుకుంటున్నట్టు కేటీఆర్ ట్వీట్లో చేశారు.
అంతకు ముందు, ఏపీలో విద్యుత్ కోతలు ఎక్కువగా ఉన్నాయంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందిస్తూ ఏపీలో విద్యుత్ కొత అంటూ లేదని, కాకపోతే పరిశ్రమలకే కొంతమేర తగ్గించామని చెప్పారు. తెలంగాణ వారికి సింగరేణి కాలరీస్ వల్ల బొగ్గు అందుబాటులో ఉండడంతో విద్యుత్ సరఫరా మెరుగ్గా ఉండొచ్చని చెప్పారు.
మహారాష్ట్రలోని అనేక పట్టణాలు, నగరాల్లో పగలే విద్యుత్ లేని పరిస్థితి, దేశ వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందని వివరించారు. ఏపీలో విద్యుత్ కొరతను అధిగమించేందుకు ఎక్కువ ధరకు కొని అయినా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి పెద్దిరెడ్డి వివరించారు.
రోడ్లు బాగాలేవన్న వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. తెలంగాణలో కంటే ఎక్కువ కిలోమీటర్లు రోడ్లు ఏపీలో వేశామన్నారు. ఏపీలో చారిత్రక రీతిలో తెలంగాణ కంటే ఎక్కువగా పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ రోడ్ల నిర్మాణం చేపట్టామని, అలాగే 10వేల కిలోమీటర్ల రోడ్ల మరమ్మత్తులు చేపట్టబోతున్నామని తెలిపారు.
తెలంగాణలో ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి.. ఏపీలో దారుణంగా ఉంది, వారికంటే మనం చాలా బెటర్ అని చెప్పుకుంటే తమకు ఓట్లు వస్తాయనుకుని కేటీఆర్ అలా చెప్పుకున్నారేమో అని మంత్రి పెద్దిరెడ్డి ఎద్దేవా చేశారు.
ఏపీలో కాదు, హైదరాబాద్ లోనే సరిగా విద్యుత్ లేదని ఏపీ మంత్రి బొత్సా సత్యనారాయణ కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందిస్తూ చెప్పారు. `కేటీఆర్ కు ఎవరో చెబితే విని చెప్పారేమో.. నేను నిన్ననే హైదరాబాద్ లో విద్యుత్ కోత అనుభవించి వచ్చా’ అంటూ కౌంటర్ ఇచ్చారు.
తెలంగాణలో విద్యుత్ కోత పరిస్థితులను స్వయంగా అనుభవించి వచ్చినా తాను ఎవరికీ చెప్పుకోలేదని, కానీ బాధ్యత కలిగిన వ్యక్తులు ఇలా చెప్పడం సరికాదని కేటీఆర్ కు హితవు చెప్పారు. అలాగే రోడ్లు సరిగా లేవన్న కామెంట్ ను ప్రస్తావిస్తూ మంత్రి కేటీఆర్ ఏపీకి వస్తే రోడ్లు ఎలా ఉన్నాయో స్వయంగా చూపిస్తా అంటూ స్పష్టం చేశారు.
ఇప్పుడు కొత్తగా వేసిన రోడ్డు మీద నుంచే మాట్లాడుతున్నా.. వచ్చి చూడండి అని సలహా ఇచ్చారు. తమ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి గొప్పలు చెప్పుకోవచ్చు కానీ.. ఇరుగు పొరుగు రాష్ట్రాలను తక్కువ చేసి మాట్లాడడం సరికాదని బొత్స కేటీఆర్ కు సూచించారు. మంత్రి కేటీఆర్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని సలహా ఇచ్చారు.
కేటీఆర్ చేసిన కామెంట్స్ వాట్సాప్ లో చూశానని ఏపీ మంత్రి రోజా చెబుతూ అందులో ఏపీ గురించి ప్రత్యేకంగా మాట్లాడారని అనుకోవడం లేదని, ఆయన మిగతా రాష్ట్రాల గురించి వ్యాఖ్యానించినట్టు అర్థమైందని తీలికగా తీసిపారవేసే ప్రయత్నం చేశారు. కేటీఆర్ ఈ వాఖ్యలు చేసిన సమయంలోనే ఆమె ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలవడం గమనార్హం.
ఆంధ్రప్రదేశ్ లో జరిగిన అభివృద్ధిని చూడాలనుకుంటే కేటీఆర్, ఆయన స్నేహితుడు వస్తే రాష్ట్రం మొత్తం తానే స్వయంగా తిప్పి చూపిస్తానని ఆమె చెప్పారు.