కొద్ది రోజుల్లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య జలవివాదాల పరిష్కారానికి అపెక్స్ కౌన్సిల్ భేటీ జరగనున్న నేపథ్యంలో తెలంగాణ నీటిపారుదల శాఖ అప్రమత్తమైంది. సమర్ధమైన వాదనలు వినిపించాలని, ప్రత్యేకంగా కృష్ణా నదీ జలాల్లో తెలంగాణ వాటాను పెంచుకోవడమే లక్ష్యంగా వ్యవహరించాలని భావిస్తోంది.
అంతకు ముందే పెండింగ్ తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతులు సాధించుకోవడం, కృష్ణా నదీ జలాల్లో తెలంగాణ రాష్ట్ర వాటాను ఇప్పుడున్న 299 టీఎంసీల నుంచి 575 టీఎంసీలకు పెంచుకోవడం, నిబంధనలకు విరుద్ధంగా ఏపీ చేస్తున జల చౌర్యం తదితర అంశాలను ఢిల్లిలోని జలశక్తి శాఖ దృష్టికి తీసుకెళ్లి రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించుకునేలా ప్రత్యేక కన్సల్టెంట్ అధికారిని నియమిం చాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది.
సాగునీటి పారుదల శాఖలోని అనుభవుజ్ఞుడైన రిటైర్డ్ జల నిపుణులను కన్సల్టెంట్గా నియమించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే పొరుగున ఉన్న ఏపీ ప్రభుత్వం ఢిల్లిలో సాగునీటిపారుదల నిపుణుడు, రిటైర్డ్ సీనియర్ ఇరిగేషన్ అధికారిని ప్రత్యేకంగా నియమించింది. ఆ అధికారి ద్వారా జల వివాదాలపై అనుసరించాల్సిన వ్యూహాలు, కేంద్ర జలశక్తిశాఖతో నేర్పుగా వ్యవహారాలు నడిపిస్తోంది.
ఈ నేపథ్యంలో తెలంగాణ కూడా త్వరలో ఢిల్లిలో సాగునీటి పారుదల రంగ నిపుణుడిని కన్సల్టెంట్గా నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నియామకం కొద్ది రోజుల్లో జరగనున్న అపెక్స్ కౌన్సిల్ భేటీకి తేలిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.
జల విద్యుత్ పై ఏపీ అభ్యంతరం
మరోవంక, జలవిద్యుత్ ఉత్పత్తి కోసం నాగార్జునసాగర్ డ్యాం నుంచి తెలంగాణ ప్రభుత్వం నీటిని వాడటంపై ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరోమారు అభ్యంతరం తెలపడం కోసం సిద్దపడుతోంది. ఇప్పటికే ఏపీ జలనవరుల శాఖ ఈఎన్సీ నారాయణ రెడ్డి ఏప్రిల్ 4వ తేదీనే కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు లేఖ రాశారు.
నాగార్జునసాగర్ ప్రాజెక్టు దిగువన ఉన్న సాగునీటి అవసరాలను పట్టించుకోకుండా విద్యుత్ ఉత్పత్తికి నీటిని వినియోగించుకోవద్దని బోర్డును ఆయన తన లేఖలో కోరారు. ఈక్రమంలోనే మే నెల 6వ తేదీన జరగనున్న కేఆర్ఎంబీ సమావేశంలో ఏపీ జలవనరుల శాఖ అధికారులు మరోమారు ప్రస్తావించనున్నారు.
తద్వారా ప్రాజెక్ట్ నుండి నీటిని వాడటం ఆపివేసి, వేసవిలో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలో తాగు, సాగు అవసరాలకు నీటి సంక్షోభాన్ని నివారించడానికి అధికారులు సమాయత్తమవుతున్నారు.