ఉక్రెయిన్ జరిపిన క్షిపణి దాడుల్లో సరిహద్దులకు ఆనుకుని ఉన్న రష్యా ప్రాంతాల్లోని చమురు డిపోలు ధ్వంసమయినట్లు అసోసియేటెడ్ ప్రెస్ (ఎపి) వార్తా సంస్థ విశ్లేషించిన శాటిలైట్ ఫోటోలను బట్టి తెలుస్తోంది. ఈ ఫోటోల్లో బ్రియాన్స్ ప్రాంతంలోని రెండు చోట్ల చమురు డిపోలకు నష్ట వాటిల్లినట్లు కనిపిస్తోంది.
ఈ పేలుళ్లలో ఒకటి కన్నా ఎక్కువ సంఖ్యలో చమురు డిపోలు ధ్వంసం అయినట్లు, ఫలితంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగినట్లు ఈ ఫోటోల్లో ఉంది. ఈ పేలుళ్లు గత సోమవారం జరిగాయి. ఒక క్షిపణి రష్యా ప్రభుత్వ అధీనంలోని ట్రాన్స్‌నెఫ్ట్ కంపెనీ అనుబంధ సంస్థ అయిన ట్రాన్స్‌నెఫ్ట్ డ్రుజ్బాకు చెందిన చమురు డిపోను తాకింది.
ఈ సంస్థ ఐరోపాకు ముడి ,మురును తీసుకెళ్లే డ్రుజ్బా పైప్‌లైన్‌ను నిర్వహిస్తుంది. దీనికి సమీపంలోనే మరో చమురు డిపోకూడా క్షిపణి దాడిలో దెబ్బతింది. ఉక్రెయిన్ సరిహద్దుకు వంద కిలోమీటర్లు ఉత్తరంగా బ్రియాన్స్ ఉంది.
ఇలా ఉండగా, రష్యా దాడులు ముమ్మరం చేసినప్పటికీ గట్టిగానే తిప్పికొడుతున్నామని, వారిని దెబ్బకు దెబ్బ తీశామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రకటించారు. ఉక్రెయిన్ పోర్ట్ సిటీ ఒడెశాపై ఆదివారం క్షిపణుల వర్షం కురిపించిన రష్యా మరికొన్ని నగరాల్లోనూ విధంసం సృష్టించింది.
రష్యా దాడిలో ఆ నగరంలోని విమానాశ్రయంలో రన్‌వే పూర్తిగా ధ్వంసమైంది. 17 సైనిక స్థావరాలను ధ్వంసం చేశామని, 200మంది ఉక్రెయిన్ సైనికులు ప్రాణాలు కోల్పోయారని రష్యా ప్రకటించింది. అయితే, రష్యా దాడులను ముమ్మరం చేసినప్పటికీ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని జెలెన్స్కీ స్పష్టం చేశారు.
తమపై రష్యా యుద్ధానికి దిగి 67 రోజులు పూర్తయిందని, ఇప్పటివరకు ఆ దేశానికి చెందిన 1000 ట్యాంకులు, 200 యుద్ధ విమానాలు, కనీసం 2500 సాయుధ వాహనాలు, 23 వేల మందికి పైగా సైనికుల ప్రాణాలు తీశామని వెల్లడించారు. గతంలో రష్యా సాధీనంలోకి వెళ్లిన అనేక పట్టణాల్లో మళ్లి ఉక్రెయిన్ స్థానిక ప్రభుత్వాలు పట్టు సాధించాయని ఆయన ప్రకటించారు.
కాగా ఉక్రెయిన్‌పై యుద్ధం నేపథ్యంలో భారీస్థాయిలో ప్రాణ నష్టాన్ని చవిచూశామని, భారీ సంఖ్యలో సైనికులు, సైనికాధికారులను కోల్పోవడం పెద్ద విషాదమని క్రెవ్లిున్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ అంగీకరించారు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ముఖాముఖి కార్యక్రమలో ఆయన మాట్లాడుతూ రష్యాకు ఎదురుదెబ్బలు తగిలిన మాట వాస్తవమేనని తెలిపారు.