దేశంలో మార్చిలో 7.60 శాతంగా ఉన్న నిరుద్యోగిత రేటు.. ఏప్రిల్‌లో 7.83 శాతానికి పెరిగింది. ఈ విషయాన్ని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సిఎంఐఇ) విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. ఇక పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగిత రేటు మార్చి నెలలో 8.28 శాతం ఉండగా.. ఏప్రిల్ పూర్తయ్యే నాటికి 9.22 శాతానికి పెరిగింది.
కాగా, గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగిత రేటు కాస్త తగ్గడం గమనార్హం. మార్చిలో గ్రామీణాల్లో నిరుద్యోగిత రేటు 7.29 శాతం ఉండగా.. ఏప్రిల్‌లో 7.18 శాతానికి తగ్గింది. నిరుద్యోగిత రేటు హర్యానాలో 34.5 శాతంతో తొలి స్థానంలో నిలువగా, దాని తర్వాతి స్థానంలో రాజస్తాన్ (28.8 శాతం) ఉంది.
దేశీయ డిమాండ్ మందగించడం, ధరల పెరుగుదల మధ్య ఆర్థిక రికవరీ నెమ్మదిగా ఉండటం వల్ల ఉద్యోగ అవకాశాలు దెబ్బతిన్నాయని ఆర్థిక నిపుణులు అంటున్నారు.
ఇక, రిటైల్ ద్రవ్యోల్బణం మార్చిలో 6.95 శాతానికి అంటే 17 నెలల గరిష్టానికి ఎగబాకగా, ఈ ఏడాది చివరి నాటికి 7.5 శాతానికి చేరుకునే అవకాశముందని సింగపూర్‌లోని క్యాపిటల్ ఎకానమిక్స్ శిలాన్ షా పేర్కొన్నారు. ఆర్బిఐలో రెపో రేటు జూన్‌లో పెరగవచ్చునని ఆయన భావిస్తున్నారు.
అదేవిధంగా పడిపోతున్న కార్మిక భాగస్వామ్య రేటుపై ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. మహమ్మారి సమయంలో అనేక మంది, తమ ఉపాధి కోల్పోవడంతో మార్చి 2019లో 43.7 శాతం ఉండగా.. 2022 మార్చిలో 39.5 శాతానికి పడిపోయింది.