కృష్ణా జలాలను 66:34 నిష్పత్తిలో పంపిణీ చేయాలనే ప్రతిపాదనను తెలంగాణ తిరస్కరించింది. రెండు రాష్ట్రాలకు చెరిసగం వాటా ఇవ్వాలని డిమాండ్ చేసింది. 66:34 నిష్పత్తిలో కృష్ణా జలాల పంపిణీలో భాగస్వామ్యం కాబోమని స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం తదుపరి చర్యలు తీసుకోవాలని తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ డిమాండ్ చేశారు.
తెలుగు రాష్ట్రాలకు నీటి వాటా, శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో 15 ఔట్లెట్లను బోర్డుకు అప్పగించడం, నిధుల కేటాయింపు, ఆర్డీఎస్‌పై చర్చలు, ప్రాజెక్టుల మరమ్మతులకు నిధులు తదితర కీలకాంశాలపై చర్చించేందుకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్ఎంబీ) శుక్రవారం హైదరాబాద్ ఎర్రమంజిల్ జలసౌధలో సమావేశం జరిగింది.
ఛైర్మెన్ ఎంపి సింగ్ అధ్యక్షతన జరిగిన ఈ బోర్డు భేటీలో సభ్యకార్యదర్శి రాయిపురే, సభ్యులు మౌంతాంగ్, ఆర్కే పిళ్లై, తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్, ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్, ఏపీ జలవనరులశాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఇంజినీర్ ఇన్ చీఫ్ నారాయణరెడ్డి, ఇంజినీర్లు పాల్గొన్నారు.
విద్యుత్ ఉత్పత్తి, వరద సమయంలో వినియోగించిన నీటి వివరాలు, తదితర అంశాలపై కూడా చర్చించినట్లు తెలిసింది. శ్రీశైలం జలాశయం నుంచి ఆంధ్రప్రదేశ్ 34 టిఎంసిలకు మించి తీసుకోరాదని తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ స్పష్టం చేశారు. తెలంగాణకు నీటి కేటాయింపుల అంశాన్ని ఇంకా ట్రిబ్యునల్‌కు నివేదించడం లేదని తెలిపారు.
కృష్ణా జలాలను 66:34 నిష్పత్తి ఒక్క ఏడాదికే అని గత సంవత్సరం అంగీకరించామన్న ఆయన… కృష్ణా జలాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెరిసగం వాటా ఇవ్వాలని కోరుతున్నామని తెలిపారు. ఈ విషయాన్ని రికార్డు చేయాలని బోర్డుకు ఇప్పటికే లేఖ కూడా రాసినట్టు ప్రకటించారు.
శ్రీశైలం ప్రాజెక్టు ఉన్నదే విద్యుత్ ఉత్పత్తి కోసమన్న రజత్‌కుమార్, ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్‌కు అభ్యంతరం తగదని ఆక్షేపించారు. పట్టిసీమ నుంచి గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కు తరలిస్తున్నప్పటికీ, తెలంగాణ రాష్ట్రానికి అదనంగా రావాల్సిన నీరు ఇవ్వడం లేదని అభ్యంతరం వ్యక్తం చేశారు.