రెండు నెలలకు పైగా ఉక్రెయిన్ పై అమానుషంగా యుద్ధం జరుపుతున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పై ఐరోపా దేశాలు విధిస్తున్న ఆంక్షలు ఆయన ప్రియురాలికి కష్టాలు తెచ్చిపెడుతున్నాయి. ఆమె ఉనికికే ప్రమాదంగా పరిణమించినట్లు తెలుస్తున్నది.
ఆమెను బహిష్కరించాలంటూ ఇప్పటికే పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. ఐరోపా యూనియన్ ఆంక్షల జాబితాలో అలీనా కబేవాను చేర్చారని వార్తలు వస్తున్నాయి. వ్లాదిమిర్ పుతిన్ ప్రపంచ దేశాల కఠిన ఆంక్షలను బేఖాతరు చేస్తూ, యుద్దాన్ని మరింత తీవ్రం కావిస్తూ ఉండడంతో, పలువురి దృష్టి ఆయన ప్రియురాలిపై పడినట్లు కనిపిస్తున్నది.
పుతిన్ ప్రియురాలుగా భావిస్తున్న జిమ్మాస్ట్ అలీనా కబయేవా (38) ప్రస్తుతం స్విట్జర్లాండ్‌లో కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉన్నట్టు తెలుస్తోంది. అలీనా కబయేవా, ఆమె నలుగురు పిల్లలు భారీ భద్రత మధ్య, చాలా రహస్యంగా నిర్మించిన షాలేలో (కొండ ప్రాంతాల్లో నిర్మించే చెక్కల కట్టడాలు) ఉంటున్నట్లు సమాచారం.
ఉక్రెయిన్ పై రష్యా సాగిస్తున్న యుద్ధం నేపథ్యంలో స్విట్జర్లాండ్ అలీనా కబయేవాను బహిష్కరించాలంటూ అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ ఛేంజ్ డాట్ ఆర్గ్ ద్వారా మూడు దేశాలకు చెందిన కొంతమంది పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో రష్యా కూడా ఉండటం విశేషం.
రష్యా, ఉక్రెయిన్, బెలారస్‌కు చెందిన పలువురు దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను సమర్థిస్తూ ఇప్పటి వరకు 50 వేల మంది సంతకాలు చేశారని తెలుస్తోంది.
ఇప్పటికే అమెరికా సహా ఐరోపా సమాఖ్య (ఈయూ) రష్యాపై పలు ఆంక్షలు అమల్లోకి తీసుకొచ్చాయి. తాజాగా ఈయూ ఆరు ఆంక్షల ప్యాకేజీని ప్రతిపాదించింది. ఈ కొత్త జాబితాలో పుతిన్ ప్రియురాలిగా భావిస్తున్న అలీనా కబయేవా పేరు ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.
తాజా ఆంక్షల జాబితాను ఈయూ ఎగ్జిక్యూటివ్ సభ్య దేశాలకు అందించారు. ఈ జాబితాలోని ఐరోపా సమాఖ్యలోని 27 దేశాలు ఏకగ్రీవంగా ఆమోదించాల్సి ఉంటుంది.
ఒకవేళ అదే జరిగితే.. అలీనా కబయేవా ఈయూలో అడుగుపెట్టకుండా ఆమెపై నిషేధం విధిస్తారు. అంతేకాదు ఆమె ఆస్తులను కూడా స్తంభింపజేసే అవకాశముంటుంది.
మరోవైపు జిమ్నాస్టిక్స్ వదిలి పెట్టిన తర్వాత అలీనా కబయేవా రష్యా రాజకీయాల్లోకి ప్రవేశించారు. కబేవా తండ్రి మరాట్ కబాయేవ్ ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ ప్లేయర్.
తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ మూడేళ్ల వయస్సులో రిథమిక్ జిమ్నాస్టిక్స్‌లో ప్రవేశించి అనంతరం రెండు ఒలింపిక్ పతకాలు, 14 ప్రపంచ ఛాంపియన్షిప్ పతకాలు, 21 యూరోపియన్ ఛాంపియన్షిప్ పతకాలు గెలుచుకుంది.
2004 ఏథెన్స్ ఒలింపిక్స్‌లో స్వర్ణం. 2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలుచుకుంది. జిమ్మాస్టిక్స్కు రిటైర్మెంట్ ప్రకటించి 2004లో రాజకీయాలలో ప్రవేశించారు. 2005లో పబ్లిక్ ఛాంబర్ ఆఫ్ రష్యా సభ్యురాలిగా, ఆ తర్వాత 2008లో పబ్లిక్ కౌన్సిల్ ఆఫ్ జాతీయ మీడియా గ్రూప్ ఛైర్మన్‌గానూ పని చేశారు.
2007, 2014లో దుమా రాష్ట్రం నుంచి యునైటెడ్ రష్యా పార్టీ తరఫున ఎంపీగా గెలిచారు. ఈ క్రమంలో పుతిన్‌తో కబయేవాకు సాన్నిహిత్యం ఏర్పడి, ఇరువురి మధ్య బంధం మరింత బలపడింది. తొలిసారిగా 2008లో పుతిన్, కబయేవా సంబంధాలపై వార్తలు ప్రపంచ వ్యాప్తంగా గుప్పుమన్నాయి. పుతిన్, కబయేవాలకు నలుగురు పిల్లలు ఉన్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.