రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) రెపోరేటును పెంచడంతో బ్యాంక్లు కూడా వడ్డీ రేట్లను పెంచడానికి ఒక్కోటిగా వరుస కడుతున్నాయి. తాజాగా హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (హెచ్డిఎఫ్సి) గృహ రుణాలపై వడ్డీరేటును పెంచేసింది. రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేట్ (ఆర్పిఎల్ఆర్) 30 బేసిక్ పాయింట్లు పెంచుతున్నట్లు శనివారం ప్రకటించింది.
ఈ నెల తొమ్మిదో తేదీ నుంచి పెంచిన వడ్డీరేట్లు అమల్లోకి వస్తాయని తెలిపింది. తాజాగా రుణాలు తీసుకునేవారు, ఇప్పటికే గృహ రుణాలు తీసుకున్న వారికి కూడా వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఇప్పటికే ఐసిఐసిఐ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా (బిఒబి), బ్యాంక్ ఆఫ్ ఇండియా (బిఒఐ), సెంట్రల్ బ్యాంక్లు వడ్డీరేట్లను పెంచాయి.
బుధవారం ఆర్బిఐ అనూహ్యంగా రెపో రేటును 40 బేసిస్ పాయింట్లు పెంచిన విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వ, ప్రయివేటు రంగంలోని విత్త సంస్థలు వడ్డీ రేట్లను పెంచే పనిలో పడ్డాయి. రుణ గ్రహీతలపై భారం పెంచాలని నిర్ణయించాయి. ఈ క్రమంలోనే ఐసిఐసిఐ బ్యాంక్ ఎక్స్టర్నల్ బెంచ్మార్క్ లెండింగ్ రేటు (ఇబిఎల్ఆర్)ను 40 బేసిస్ పాయింట్లు పెంచడం ద్వారా 8.1 శాతానికి చేర్చింది. మే 4 నుంచే కొత్త వడ్డీరేట్లు అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది.
బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో ఆధారిత లెండింగ్ రేటు (ఆర్బిఎల్ఆర్) 7.25 శాతానికి చేర్చింది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సైతం తమ ఆర్బిఎల్ఆర్ను 0.4 శాతం పెంచి 7.25 శాతానికి పెంచింది. బ్యాంక్ ఆఫ్ బరోడా రుణాలపై వడ్డీ రేటును మరో 40 బేసిస్ పాయింట్లు పెంచడంతో బిఆర్ఎల్ఆర్ను 6.9 శాతానికి చేర్చింది.