ఉక్రెయిన్‌పై సైనిక చర్య పేరుతో ఐదారురోజులలో ఆ దేశం తమ ఆధీనంలోకి వస్తుందనే అంచనాలతో యుద్దానికి దిగిన రష్యా ఊహించని తీవ్ర ప్రతిఘటన ఎదురు కావడంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నది. భారీగా ప్రాణనష్టాన్ని చవిచూసిందని, యుద్ధ సామాగ్రి, ఆయుధ సంపత్తిని పెద్దఎత్తున కోల్పోయిందని బ్రిటన్ రక్షణశాఖ వెల్లడించింది.
రష్యా బలగాల్లో అత్యంత సమర్ధమైన విభాగాల్లో ఈ నష్టం మరీ ఎక్కువగా జరిగిందని స్పష్టం చేసింది. బ్రిటన్ రక్షణశాఖకు చెందిన ఇంటెలిజెన్స్ విభాగం అందించిన తాజా నివేదికలోప్రకారం వేలాది సైనికులను, ప్రత్యేకించి దళాలను ముందుండి నడిపే హోదాల్లోని సైనికాధికారులను పెద్దసంఖ్యలో కోల్పోయింది.
మరోవైపు రష్యాకు చెందిన అత్యాధునిక 7-90 యుద్ధట్యాంక్‌ను ఉక్రెయిన్ ధ్వంసం చేసిందని స్పష్టం చేసింది. రష్యా వద్ద ప్రస్తుతం ఈ తరహా యుద్ధ ట్యాంకులు కేవలం 100 మాత్రమే ఉన్నాయి. కాగా ఉక్రెయిన్‌పై యుద్దం నేపథ్యంలో ఐరోపా సహా ప్రపంచ దేశాలు రష్యాపై ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఆయుధాల తయారీ వేగం మందగించనుంది.
కాగా శనివారంనాడు నల్లసముద్రంలోని స్నేక్ఐలాండ్ సమీపంలో రష్యాకు చెందిన నౌకను ధ్వంసం చేసినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది. బేరక్తార్ టిబి2 క్షిపణిని ప్రయోగించి పేల్చేశామని ప్రకటించింది. రెండో ప్రపంచ యుద్ధంలో విజయానికి సంకేతంగా రష్యా నిర్వహించనున్న విజయోత్సవాలను ఈసారి స్నేక్ ఐలాండ్‌లో నిర్వహించనున్న నేపథ్యంలో ఉక్రెయిన్ ఈ దాడికి పాల్పడింది.
మే 9న ఈ ఉత్సవాలు జరగనుండగా, అదే రోజు ఉక్రెయిన్‌పై పూర్తి యుద్ధాన్ని ప్రకటిస్తారన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఉక్రెయిన్ కాస్త దూకుడుగా వ్యవహరిస్తోంది. జాగారం ఉక్రెయిన్‌లో మరో నౌకాశ్రయం ఉన్న కీలక నగరం ఒడెశాపై రష్యా విరుచుకుపడింది. క్షిపణుల వర్షం కురిపించింది.
శనివారం ఉదయాన్నే వరుసగా నాలుగు క్షిపణులను ప్రయోగించి విధ్వంసానికి పాల్పడిందని ప్రాంతీయ పరిపాలనావిభాగం అధికార ప్రతినిధి బ్రాత్చుక్, ఎంపీ లీసా వసిలెంకో ప్రకటించారు. మౌలిక వసతులను ధ్వంసం చేయడమే కాకుండా ప్రజలను మానసికంగా బలహీనులను చేసే దిశగా రష్యా వ్యవహరిస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. డాచ్నే సమీపంలోని 18 ఉక్రెయిన్ సైనిక స్థావరాలను ధ్వంసం చేశామని రష్యా ప్రకటించింది.
పోర్ట్‌సిటీ మరియపోల్ స్టీల్ ప్లాంట్‌లో చిక్కుకుపోయిన వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రక్రియ వేగం పుంజుకుంది. శుక్ర, శనివారాలలో దాదాపు 100 మందిని తరలించారు. మరికొందరిని వేగంగా తరలించగలమని అంతర్జాతీయ రెడ్‌క్రాస్ సొసైటీ ఆశాభావం వ్యక్తం చేసింది.
కాగా మరియపోల్‌లో రష్యా కాల్పుల విరమణ ఒప్పందాన్ని తరచూ ఉల్లంఘిస్తోందని, అకృత్యాలకు పాల్పడుతోందని, పౌరులను, సైనికులను దారుణంగా హింసిస్తోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీఆరోపించారు. శనివారం కనీసం 40మంది మహిళలు, చిన్నారులను సురక్షితంగా తరలించామని, ప్లాంట్‌లో చిక్కుకుపోయిన సైనికులను కాపాడేందుకు దౌత్య ప్రయత్నాలు ముమ్మరం చేశామని తెలిపారు.
కాగా పెద్దఎత్తున ఉక్రెయిన్ శరణార్థులను ఆదుకుంటున్న రొమేనియా ప్రభుత్వాన్ని అమెరికా ప్రథమ మహిళ జిల్ బిడెన్ ప్రశంసించారు. స్లొవేకియా, రొమేనియాలలో నాలుగు రోజులు పర్యటించనున్న ఆమె శనివారం రొమేనియా రాజధాని బుకారెస్ట్‌లోని అమెరికా దౌత్య కార్యాలయంలో మాట్లాడారు.
మరోవంక, ఉక్రెయిన్‌లో పరిణామాలపై ఎట్టకేలకు ఐక్యరాజ్య సమితి భద్రతామండలి అధికారికంగా స్పందించింది. ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని కేవలం వివాదంగానే పేర్కొంటూ ఏకగ్రీవ ప్రకటన విడుదల చేసింది. ఉక్రెయిన్ వివాదానికి శాంతియుత పరిష్కారంకోసం ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ అంటోనియా గుటెరస్ చేస్తున్న ప్రయత్నాలకు సంపూర్ణ మద్దతు ప్రకటించింది.