మానసిక వైకల్యం ఉన్న బాలుడిని అతని కుటుంబంతో కలిసి విమానం ఎక్కేందుకు అనుమతించక పోవడంతో ఇండిగో ఎయిర్‌లైన్స్‌పై విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింథియా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రవర్తనను ఎన్నటికీ సహించేది లేదని, ఏ వ్యక్తీకి ఇలాంటి అనుభవం జరగకూడదని స్పష్టం చేశారు.
ఈ ఘటనపై స్వయంగా విచారణ చేపట్టి తగిన చర్యలు చేపడతామని ఆయన ట్వీటర్లో తెలిపారు. ఈ ఘటనపై ఏవియేషన్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) కూడా దర్యాప్తు ప్రారంభించిందని, ఇండిగో ఎయిర్‌లైన్స్‌ను నివేదిక సమర్పించాల్సిందిగా ఆదేశించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
వివరాల ప్రకారం హైదరాబాద్ వెళ్లేందుకు గత శనివారం ఓ చిన్నారితో కుటుంబం రాంచీ విమానాశ్రయానికి వచ్చింది. అయితే ఆ బాలుడు మానసిక వైకల్యం కలిగి ఉండటంతో విమానం ఎక్కేందుకు ఇండిగో సిబ్బంది నిరాకరించారు. చిన్నారి భయాందోళనతో ఉన్నాడని, దాని వల్ల ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుందనే కారణంతో చిన్నారిని ఎక్కనివ్వలేదు.
ఈ ఘటన గురించి మనీషా గుప్తా అనే తోటి ప్రయాణికురాలు తన ఫేస్బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు. చిన్నారిని అడ్డుకున్న ఇండిగో సిబ్బంది అతడి తల్లిదండ్రులతో వాగ్వాదానికి దిగారని పేర్కొన్నారు. అత్యవసరమైతే ప్రయాణం మధ్యలో బాలుడికి వైద్య సేవలు అందిస్తామని అదే విమానంలో ప్రయాణిస్తున్న వైద్యుల బృందం హామీ ఇచ్చినప్పటికీ సిబ్బంది పట్టించుకోలేదని మనీషా పేర్కొన్నారు.
“నిన్న, రాంచీ విమానాశ్రయంలో, ప్రత్యేక అవసరాలు గల ఒక యుక్తవయస్కుడు తీవ్ర అసౌకర్యానికి గురయ్యాడు. ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లే సమయంలో అలసట, ఆపై భద్రతా తనిఖీల ఒత్తిడి అతన్ని ఆకలి, దాహం, ఆందోళన, గందరగోళంకు గురి చేసింది. అతని తల్లితండ్రులకు అతనిని ఎలా ఓదార్చాలో స్పష్టంగా తెలుసు – ఓర్పు, సహనం, దృఢత్వం, అనేక కౌగిలింతలతో. బోర్డింగ్ ప్రారంభమయ్యే సమయానికి, పిల్లవాడికి ఆహారం, మందులు ఇచ్చారు. అతను సిద్ధంగా ఉన్నట్లు అనిపించింది… అప్పుడు మేము క్రూరమైన అధికారం, శక్తి యొక్క పూర్తి ప్రదర్శనను చూశాము” అంటూ విమాన సిబ్బంది ప్రవర్తన పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.
మిగతా ప్రయాణికులు విమాన మేనేజర్ ప్రవర్తనను తీవ్రంగా వ్యతిరేకించారని, చిన్నారిని, అతని తల్లిదండ్రులను వీలైనంత త్వరగా విమానం ఎక్కించాలని వారు డిమాండ్ చేశారని, చాలా మంది ఇండిగో సిబ్బందిని రూల్ బుక్‌లోని సంబంధిత నిబంధనలు ప్రస్తావిస్తూ వారి ప్రవర్తనను సవాల్ చేశారని ఆమె వివరించారు.
వైకల్యాలున్న ప్రయాణికుల పట్ల ఏ విమానయాన సంస్థ కూడా ఎలా వివక్ష చూపదు అనే దానిపై సర్వోన్నత న్యాయస్థానం తీర్పులపై వార్తా కథనాలు, ట్విట్టర్ పోస్ట్‌లతో వారు తమ మొబైల్ ఫోన్ల ద్వారా చూపారని ఆమె తెలిపారు.
ఇది చాలా అమానవీయ ఘటన అంటూ ఇండిగో తీరుపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భయంతో ఉన్న ఆ చిన్నారి స్థిమిత పడితే విమానం ఎక్కించాలని వేచి చూశామని, కానీ కానీ ఫలితం లేకపోయిందని ఇండిగో సంస్థ పేర్కొంది. ఆ కుటుంబానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా, ఒక హోటల్లో వసతి సౌకర్యం కల్పించామని మరుసటి రోజు వారు తమ గమ్యస్థానానికి చేరుకున్నట్లు వెల్లడించింది.