రూపాయి విలువ సోమవారం ఉదయం ట్రేడింగ్‌లో ఎన్నడూ లేనంతగా కనిష్టానికి పడిపోయింది. డాలర్‌కు రూ.77.41గా ట్రేడవుతోంది. చైనాలో లాక్డౌన్లు, అమెరికాలో వడ్డీ రేట్ల పెంపు, యుద్ధ భయం, దేశీయ స్టాక్ మార్కెట్ల పతనం, ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ పెట్టుబడుదారుల నిష్క్రమణ రూపాయి పతనానికి కారణమవుతున్నాయి.
రాయిటర్స్, పిటిఐ నివేదిక ప్రకారం.. గత శుక్రవారం భారత్ కరెన్సీ రూపాయి ఆల్‌టైమ్ కనిష్టానికి చేరి రూ 77.05 వద్ద ముగిసింది. ఇది సోమవారం మరింత బలహీనపడి మధ్యాహ్నం 12:00 గంటల సమయంలో డాలరుతో రూపాయి మారకపు విలువ రూ.77.37 వద్ద ట్రేడవుతోంది.
కీలక వడ్డీరేట్లను 50 బేసిస్ పాయింట్లు పెంచనున్నట్లు గతవారం ఫెడరల్ రిజర్వు ప్రకటించడంతో డాలర్‌కు డిమాండ్ పెరిగింది. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు రానున్న రోజుల్లో వడ్డీరేటును మరింత పెంచుతున్నట్లు ప్రకటించడం కూడా డాలర్ విలువను మరింత పెంచింది.
అమెరికాలో వడ్డీ రేట్లు పెరిగితే… (అభివృద్ధి చెందుతున్న దేశాలు) భారత్ మార్కెట్ల నుండి పెట్టుబడిదారులు మార్కెట్ల నుండి తమ పెట్టుబడులు ఉపసంహరించుకుంటూ ఉంటారు. ఇప్పటి వరకు 2022లో భారత మార్కెట్ నుంచి విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు రూ.1.3 లక్షల కోట్లు ఉపసంహరించుకున్నారు.
రూపాయి బలపడడం వల్ల రాబడి తగ్గడమే ఇందుకు కారణం. ఏప్రిల్‌లో 2 శాతానికి పైగా నష్టపోయిన అనంతరం భారతీయ మార్కెట్లు మేలో బలహీనంగా ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ నాటి ద్రవ్యోల్బణ గణాంకాలు, అంతర్జాతీయ పరిణామాలు ఆకర్షణీయంగా లేనందున పెట్టుబడిదారులు వెనక్కి తగ్గుతున్నారు.
ద్రవ్యోల్బణ కట్టడి కోసం ఫెడ్‌కు అనుగుణంగా భారత్ కూడా వడ్డీ రేట్లు పెంచింది. అయితే స్టాక్ మార్కెట్లు పతనం కావడం రూపాయిపై ఒత్తిడిని పెంచుతుంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభంతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు మరింత పెరిగాయి.
అప్పటి నుంచి రూపాయి విలువ బలహీనంగా కనిపిస్తుంది. రష్యా నుండి భారత్ తన అవసరాల్లో 85 శాతం చమురును దిగుమతి చేసుకుంటోంది. దీంతో దిగుమతుల బిల్లు పెరగడం కూడా ద్రవ్యోల్బణానికి కారణమవుతోంది.