రాజద్రోహం చట్టంపై రెండు రోజులలో మాట మార్చి, సుప్రీం కోర్టులో రెండు అఫిడవిట్ లను దాఖలు చేసిన కేంద్ర ప్రభుత్వం తాజాగా రాష్ట్రాలు మైనారిటీ హోదా ప్రకటించడంపై కూడా భిన్న వాదనలు వినిపించినట్లు వెల్లడైనది.
కొన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో హిందువులకు మైనారిటీ హోదాను కల్పించడంపై కేంద్ర ప్రభుత్వ వైఖరి మారడంతో సుప్రీంకోర్టు మంగళవారం అసంతృప్తి వ్యక్తం చేసింది. అంతకుముందు సమర్పించిన అఫిడవిట్లో రాష్ట్రాలపైకి బాధ్యతను నెట్టేసి, తాజాగా దాఖలు చేసిన అఫిడవిట్లో మైనారిటీలను నోటిఫై చేసే అధికారం తనకు ఉందని చెప్పడం ప్రశంసించదగినది కాదని స్పష్టం చేసింది.
న్యాయవాది అశ్విని కుమార్ ఉపాధ్యాయ 2020 ఆగస్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది. జాతీయ మైనారిటీల కమిషన్ చట్టంలోని సెక్షన్ 2(సీ)ని పిటిషనర్ సవాల్ చేశారు. అదేవిధంగా ఈ చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి ఉన్న అధికారాలను సవాల్ చేశారు.
2011 జనాభా లెక్కల ప్రకారం లక్షద్వీప్, మిజోరాం, నాగాలాండ్, మేఘాలయ, జమ్మూ-కశ్మీరు, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, పంజాబ్‌లలో హిందువులు సంఖ్యాపరంగా ఇతర మతాల వారి కన్నా అల్ప సంఖ్యాకులుగా మారిపోయారని తెలిపారు. ఈ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో హిందువులకు మైనారిటీ హోదాను కల్పించాలని కోరారు.
ఈ సందర్భంగా టీఎంఏ పాయ్ వర్సెస్ కర్ణాటక స్టేట్ కేసులో సుప్రీంకోర్టు తీర్పును ప్రస్తావించారు. విద్యా సంస్థలను ఏర్పాటు చేసి, నిర్వహించేందుకు మైనారిటీలకు హక్కులు ఉన్నాయని అధికరణ 30 చెప్తోందని సుప్రీంకోర్టు చెప్పిందని పేర్కొన్నారు.
మతపరమైన, భాషాపరమైన అల్పసంఖ్యాకులను రాష్ట్రాలవారీగా పరిశీలించాలని చెప్పిందని తెలిపారు. దీనిపై స్పందించాలని 2020 ఆగస్టు 28న కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసు ఇచ్చింది. సుప్రీంకోర్టు అనేకసార్లు కోరిన తర్వాత కేంద్ర ప్రభుత్వం స్పందిస్తూ మార్చి 25న ఓ అఫిడవిట్‌ను దాఖలు చేసింది.
మైనారిటీ హోదాను మంజూరు చేసే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వాలపై పెట్టేందుకు ప్రయత్నించింది. రాష్ట్రాలకు కూడా ఉమ్మడి అధికారాలు ఉన్నాయని తెలిపింది. ఈ అఫిడవిట్‌ను పక్కనపెట్టేవిధంగా మే 9న మరొక అఫిడవిట్‌ను కేంద్ర ప్రభుత్వం సమర్పించింది.
ఈ కొత్త అఫిడవిట్లో, మైనారిటీలను నోటిఫై చేసే అధికారం తనకు (కేంద్ర ప్రభుత్వానికి) ఉందని తెలిపింది. ఈ అంశానికి విస్తృత పర్యవసానాలు ఉంటాయని కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వాలతోనూ, ఇతర సంబంధిత వర్గాలతోనూ చర్చించేందుకు సమయం కావాలని చెప్పింది.
ఈ పిటిషన్‌పై విచారణ జరుపుతున్న జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ ఎంఎం సుందరేశ్ ధర్మాసనం కేంద్ర ప్రభుత్వ వైఖరి పట్ల అసంతృప్తి వ్యక్తం చేసింది. గతంలో చెప్పిన దాని నుంచి కొంత వరకు వెనుకడుగు వేయడంగా కనిపిస్తోందని జస్టిస్ కౌల్ చెప్పారు.
దీనిని తాము మెచ్చుకోలేక పోతున్నామని అంటూ పూర్తిగా తలక్రిందులయ్యారని తెలిపారు. ఈ అంశంలో ఏం చేయాలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకోలేక పోతుండటాన్ని తాను అర్థం చేసుకోలేక పోతున్నానని చెప్పారు. ఈ విషయాన్ని గతంలోనే చెప్పి ఉండవలసిందని, ఇటువంటి వైఖరి వల్ల అనిశ్చితి ఏర్పడుతుందని తెలిపారు.
దీని మీద దృష్టి పెట్టే లోగానే దీని స్వభావం కారణంగా ఇది బహిరంగంగా ప్రజల మధ్యకు వెళుతుందని, ఇది తన సొంత డైనమిక్స్‌ను సృష్టిస్తుందని చెప్పారు. రాష్ట్రాలతో చర్చించాలనుకుంటే ఓ నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి తెలిపారు.
పరిష్కారం అవసరమయ్యే ప్రతిదీ సంక్లిష్టమైనది కాదని, మనమే దానిని అలా చేస్తామని చెప్పారు. భారత ప్రభుత్వం నుంచి రావలసిన సమాధానం ఇది కాదని స్పష్టం చేశారు. ‘‘మీకు ఏం కావాలో మీరు నిర్ణయించుకోండి. సంప్రదించాలనుకుంటే సంప్రదించండి, ఎవరు మిమ్మల్ని ఆపుతున్నారు?’’ అని అడిగారు.
రాష్ట్రాలతో చర్చలు జరిపేందుకు సుప్రీంకోర్టు ధర్మాసనం కేంద్ర ప్రభుత్వానికి గడువు ఇచ్చింది. తదుపరి విచారణ ఆగస్టు 30న జరుగుతుందని తెలిపింది.