రాజకీయ, సామాజిక విశ్లేషకుడు సి.నరసింహారావు కన్నుమూశారు. అనారోగ్యంతో అర్థరాత్రి 1.50కి ఆయన తుదిశ్వాస విడిచారు. సాయంత్రం 4 గంటలకు మహా ప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. వ్యక్తిత్వ వికాసంపై సి.నరసింహారావు అనేక పుస్తకాలు రాశారు. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
సి. నరసింహారావు 1948, డిసెంబర్ 28న జన్మించారు. ప్రస్తుతం ఆయన వయసు 73 సంవత్సరాలు. క్రిష్ణా జిల్లా పెద్దపాలపర్రులో ఆయన జన్మించారు. విజయీభవ, విజయపథం, వ్యక్తిత్వ వికాసం, అన్యోన్య దాంపత్యం, పిల్లల్ని ప్రతిభావంతులుగా పెంచడం ఎలా?, బిడియం వద్దు, అద్భుత జ్ఞాపకశక్తి వంటి అనేక పుస్తకాలు రచించారు.
తెలుగులో మొట్టమొదటిసారిగా మనో వైజ్ఞానిక మాసపత్రిక “రేపు” ను ప్రారంభించి సంచలనం సృష్టించారు. ఆ తర్వాత తొలి వ్యక్తిత్వ వికాస గ్రంధం “వ్యక్తిత్వ వికాసం” ప్రచురించి విశేష ప్రజాదరణ పొందారు. పలు సార్లు ముద్రణకు నోచుకోని, లక్షలాది మందికి ఈ గ్రంధం చేరింది. ఆ తర్వాత వ్యక్తిత్వ వికాస గ్రంధాలు అనేకం వ్రాసారు.
ఎన్ టి రామారావు, సోనియా గాంధీ, నరేంద్ర మోదీ, వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి వంటి పలువురు రాజకీయ నాయకులపై వ్యక్తిత్వ విశ్లేషణ గ్రంధాలు వ్రాసారు. పలు పత్రికలలో వేలాది వ్యాసాలు వ్రాసారు. గత పదేళ్లుగా తెలుగు వారి అభివృద్ధి అంశాలపై దృష్టి సారిస్తున్నారు. రాష్ట్ర విభజన జరిగిన తీరుతెన్నుల పట్ల తీవ్ర ఆవేదనకు లోనయ్యారు.
ఆయన ఎందరెందరో రచయితలు, జర్నలిస్టులకు స్ఫూర్తిగా నిలిచారు. తాను నమ్మిన అంశాలపై నిర్మోహమాటంగా, సాధికారికంగా సమర్ధించు కొంటూ మాట్లాడ గలగడం ఆయనకే చెల్లుబాటు అవుతుంది. అనేకమంది రాజకీయ నాయకులతో సన్నిహితంగా వ్యవహరించారు. ఎందరెందరో ప్రముఖులతో సాన్నిహిత్యం కలిగి ఉన్నారు. ఆయనకు భార్య, ఒక కుమారుడు ఉన్నారు.
నరసింహారావు మృతి పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. వ్యక్తిత్వ వికాసంపై తాను రాసిన పుస్తకాల ద్వారా నరసింహారావు ఎంతో ప్రాచుర్యం పొందారని తెలిపారు. జర్నలిస్టుగా, వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా సమాజానికి ఆయన అందించిన సేవలు మరువ లేనివని కొనియాడారు. నరసింహారావు కుటుంబానికి చంద్రబాబు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.