టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కోసం భూమిని కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజ్ శ్రవణ్ మండిపడ్డారు. బంజరాహిల్స్ లోని ఎకరాకు పైగా స్థలాన్ని టీఆర్ఎస్ పార్టీకి కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇచ్చింది.
దీనిపై దాసోజ్ శ్రవణ్ మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణం కోసం గతంలోనే కాంగ్రెస్ పార్టీ భూమి కేటాయించిందని, అక్కడ భవ్యమైన భవనం నిర్మించుకున్నారని గుర్తు చేశారు. మళ్లీ ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి స్థలాన్నిఇవ్వడమేంటని ప్రశ్నించారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిసోమేశ్ కుమార్ ప్రభుత్వ సొమ్మును టీఆర్ఎస్ కు ధారాదత్తం చేస్తున్నారని ఆరోపించారు. వంద కోట్ల విలువైన భూమిని గజానికి రూ.100 కే ఇవ్వడం విడ్డూరమని విమర్శించారు.
టీఆర్ఎస్ భవన్ లో టీవీ చానెల్ నడుపుతున్నారన్న ఆయన అందుకే వేరే చోట పార్టీ కార్యాలయ నిర్మాణం కోసం టీఆర్ఎస్ కు ప్రభుత్వ భూమిని కేటాయించారని పేర్కొన్నారు. ప్రజల సొమ్మును టీఆర్ఎస్ దోచుకుంటోందని, ఎనిమిదేళ్లలో టీఆర్ఎస్ ఆస్తులు వెయ్యి కోట్లకు చేరాయంటే వాళ్ల అవినీతి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవాలని ధ్వజమెత్తారు.
ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కు తీసుకునే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని స్రావం స్పష్టం చేశారు. టీఆర్ఎస్ కు కేటాయించిన స్థలంలో పేదలకు ఇళ్లు కట్టించాలని ఆయన డిమాండ్ చేశారు.
పేదోళ్ల త్యాగాల మీద రాష్ట్రం ఏర్పడితే పేదోళ్లు పేదోళ్లుగానే మిగిలారని, టీఆర్ఎస్ పార్టీ, ఆ పార్టీకి చెందిన నాయకులు మాత్రం కోట్లు గడించారని ఆయన ఎద్దేవా చేశారు. బంగారు తెలంగాణ అంటే ఇదేనా అని నిలదీశారు.
కాగా, పేదలకు ఇండ్లు ఇవ్వని కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కోసం రూ.150 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని తీసుకుంటున్నాడని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ విమర్శించారు. అన్ని జిల్లా కేంద్రాల్లో అత్యంత విలువైన ప్రభుత్వ స్థలాల్లో పార్టీ కార్యాలయాలు కట్టేందుకు కేసీఆర్ సిద్ధమైందని దుయ్యబట్టారు.