కేసీఆర్ పై సాగిస్తున్న రాజకీయ పోరాటాన్ని పతాక సన్నివేశంకు తీసుకు వెళ్లడం ద్వారా వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణాలో పాగా వేయాలని చూస్తున్న బిజెపి శనివారం ప్రతిష్టాకరంగా బహిరంగ సభ నిర్వహిస్తున్న ఓ రోజు ముందు రెండో దశ ప్రజా సంగ్రామ యాత్రను పూర్తి చేసుకుంటున్న రాష్ట్ర బీజేపీకి అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ కు రాష్ట్ర ఐటి మంత్రి, టి ఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటి రామారావు లీగల్ నోటీసు పంపారు.
ఈ బహిరంగ సభకు కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా హాజరుకానున్నారు. ఈ నెల 11వ తేదీన ట్విటర్లో మంత్రి కేటీఆర్‌పై బండి సంజయ్ చేసిన ఆరోపణలపై ఆధారాలు చూపించాలని కేటీఆర్ అందులో డిమాండ్ చేశారు. ఆధారాలు చూపించకుంటే పరువు నష్టం దావా వేస్తానని కేటీఆర్ హెచ్చరించారు.
అయితే, లీగల్ నోటీసుల పేరుతో కేసీఆర్, కేటీఆర్ లు చేసే తాటాకు చప్పళ్లకు భయపడే ప్రసక్తే లేదని సంజయ్ తేల్చి చెప్పారు. ‘‘నీకు నిజంగా ఇంటర్మీడియట్ విద్యార్థుల చావుకు కారణమైన గ్లోబరీనా సంస్థతో సంబంధం లేకుంటే… ఈ వ్యవహారంలో ఐటీ శాఖ తప్పు లేదని భావిస్తే.. సీబీఐ విచారణ జరపాలని కేంద్రానికి లేఖ రాయ్.. ’’ అని ఎదురు సవాల్ విసిరారు.
48 గంటల్లోపు స్పందించాలని నోటీసుల్లో కేటీఆర్, బండి సంజయ్‌కు స్పష్టం చేశారు. ఈ మేరకు తన న్యాయవాది చేత బండి సంజయ్ కు నోటీసులు పంపించారు. మంత్రి కేటీఆర్ కి ప్రజలలో గల ఆదరణను దృష్టిలో ఉంచుకొని, ఆయనపై నిరాధార పూరితమైన ఆరోపణలు చేసి ప్రచారం పొందాలన్న దురుద్దేశంతోనే సంజయ్ అబద్ధాలు చెప్పారని నోటీసులో న్యాయవాది పేర్కొన్నారు.
ఒక జాతీయ స్థాయి పార్టీ కి ప్రాతినిధ్యం వహిస్తున్న బండి సంజయ్ ప్రజా జీవితంలోని కనీస ప్రమాణాలు పాటించకుండా, కేవలం ప్రచారం పొందాలన్న యావతో ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యల అంశాన్ని తన క్లైంట్ కేటీఆర్ కి ఆపాదించే దురుద్దేశ పూర్వకమైన ప్రయత్నం చేశారని పేర్కొన్నారు.
మంత్రి కేటీఆర్ పరువుకు కలిగించేలా, అసత్య పూరిత వ్యాఖ్యలు చేసిన సంజయ్ సివిల్ మరియు క్రిమినల్ చట్టాల ప్రకారం మంత్రి కేటీఆర్ కు పరిహారం చెల్లించడంతో పాటు చట్టప్రకారం తగిన చర్యలకు అర్హులవుతారని సదరు ఆ న్యాయవాది నోటీసుల్లో స్పష్టం చేసారు.
“వాస్తవాలే మాట్లాడుతున్నా.. నువ్వు ఐక్య రాజ్యసమితి పోయి నోటీస్ ఇచ్చుకో…నామీద దావా వేసే ముందు గ్లోబరీనా సంస్థకే ఆయనకున్న సంబంధమేంటో చెప్పాలి. మీరు ఉద్యోగాలివ్వకపోవడంవల్ల వందల సంఖ్యలో యువకులు ఆత్మహత్యలు చేసుకున్నరు. వాళ్ల చావులకు నువ్వు, నీ అయ్యనే కారణం. ఇయ్యి లీగల్ నోటీస్…” అంటూ సంజయ్ మండిపడ్డారు.
“ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలకు, గుండె ఆగిన కార్మికుల చావులకు నీ అయ్యనే కారణం… ఇయ్యి లీగల్ నోటీస్…317 జీవోతో ఇంటికొకరు పుట్టకొకరు అయి చాలామంది ఉద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు.. ఇయ్యి లీగల్ నోటీస్. వరి వేస్తే ఉరే అన్న ప్రకటనతో వరి కల్లాల మీద తనువు చాలించిన రైతుల చావులకు నీ అయ్యే కారణం… ఇయ్యి లీగల్ నోటీస్… ” అంటూ కేసీఆర్ ప్రభుత్వంపై సంజయ్ ఎదురు దారి చేశారు.