కోర్టు ధిక్కార కేసులో గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జివిఎంసి) మాజీ కమిషనర్ ఎం.హరి నారాయణ్‌కు హైకోర్టు మూడు నెలల సాధారణ జైలు శిక్ష, రూ.రెండు వేలు జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. ఈ తీర్పుపై అప్పీల్ దాఖలు చేసుకోడానికి వీలుగా శిక్ష అమలును ఆరు వారాలపాటు నిలిపివేసింది.
ఈ మేరకు జస్టిస్ బి.దేవానంద్ ఇటీవల తీర్పునిచ్చారు. ఈ తీర్పుపై డివిజన్ బెంచ్ స్టే ఇవ్వకపోతే జూన్ 16న హైకోర్టు జ్యుడీషియల్ రిజిస్ట్రార్ ఎదుట లంగిపోవాలని షరతు విధించారు. ఇదే కోర్టు ధిక్కార కేసు నుంచి గంట్యాడ సర్కిల్ ఇన్స్పెక్టర్ సోమశేఖర్, మాజీ ఎమ్మెల్యే పి.శ్రీనివాస్‌లకు విముక్తి లభించింది. వీరిపై కోర్టు ధిక్కార కేసును మూసేస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు.
వీధి వ్యాపారాలకు గుర్తింపు కార్డులిచ్చిన అధికారులు తమ విషయంలో చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తూ, షాపుల్ని మూసేసి జీవనాన్ని దెబ్బతీస్తున్నారని పేర్కొంటూ 2017లో కూరగాయలు, చిల్లర వ్యాపారుల సంఘం రిట్ దాఖలు చేసింది. వీరి విషయంలో అధికారుల చర్యలు చట్ట ప్రకారమే ఉండాలని, వాళ్ల వ్యాపారాల్లో జోక్యం చేసుకోరాదని గతంలో హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
ఆ తర్వాత మున్సిపల్ అధికారులు ఇచ్చిన నోటీసుకు వ్యాపారులు జవాబు చెబుతూ తమకు మున్సిపల్ చట్టం వర్తించదని చెప్పారు. ఆపై మున్సిపల్ అధికారులు పోలీసుల సాయంతో చిల్లర షాపులు, బంకులను, వీధి దుకాణాల్ని తొలగించారు.
ఇది కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించడమేనని అప్పటి జివిఎంసి కమిషనర్ హరి నారాయణ్, పోలీసు ఇన్స్పెక్టర్ సోమశేఖర్, అప్పటి ఎమ్మెల్యే శ్రీనివాస్‌లను ప్రతివాదులుగా చేరుస్తూ కోర్టు ధిక్కార కేసును హైకోర్టులో దాఖలు చేశారు. రోడ్డును ఆక్రమించుకుని వ్యాపారాలు చేస్తుంటే నోటీసులిచ్చామని, స్పందించకపోవడంతో వాటిని ప్రజావసరాల నిమిత్తం తొలగించామని, కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించలేదన్న జివిఎంసి వాదనను హైకోర్టు తోసిపుచ్చింది.
వీధి వ్యాపారాలు మున్సిపల్ చట్ట పరిధిలోకి రావని, వీధి వ్యాపారుల చట్టం 2014 పరిధిలోకి వస్తుందని, దీనికి అనుగుణంగా పిటిషనర్లకు గుర్తింపు కార్డులు కూడా ఇచ్చారని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఖాళీ చేసేందుకు 30 రోజుల గడువు నోటీసు విధిగా ఇవ్వాలని, అందుకు విరుద్ధంగా అధికారులు దౌర్జన్యంగా ఖాళీ చేయించారని న్యాయమూర్తి తీర్పునిచ్చారు. ఇందుకు నాటి కమిషనర్ హరినారాయణ్‌ను బాధ్యుడిగా చేస్తూ జైలు శిక్ష, జరిమానా విధించారు. మిగిలిన వారికి కోర్టు ధిక్కారంతో సంబంధం లేదని తేల్చారు.